నిర్దిష్టమైన ఉత్తర్యులు వచ్చే వరకూ సమ్మె

  • ఎస్పీడి, కెజిబివి సెక్రటరీ వైఖరివల్లే సమగ్రశిక్ష ఉద్యోగుల ఆందోళన
  • కాకినాడ ఆర్డీవో కార్యాలయం ముట్టడిలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె 16వ రోజుకి చేరుకుంది.రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గురువారం కాకినాడ ఆర్డిఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా విధులకు ఆటంకం కలిగించొద్దని పోలీసులు ముట్టడి చేస్తున్న ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబాబ్జి కలగజేసుకుని రాజ్యాంగం ప్రకారం పోలీసులు విధులు నిర్వహించాలని కోరారు. నిరసన తెలియజేసే హక్కు ప్రతీ భారత పౌరుడికి ఉంటుందని గుర్తుచేశారు. ఇలా న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న కాంట్రాక్టు ఉద్యోగులను భయపెట్టేలా పోలీసులు వ్యవహరించడాన్ని మానుకోవాలని హితవు పలికారు. ఈ ముట్టడి కార్యక్రమంలో ఏపీ సమగ్రశిక్ష కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ చట్టబద్ధంగా నెల రోజులకు ముందే ప్రభుత్వానికి, సమగ్రశిక్ష అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చి సమ్మె చేస్తున్నామని, నెల రోజుల సమయంలో రాష్ట్ర అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతోనే, ఉద్యోగుల డిమాండ్లపై కనీసం స్పందించకపోవడం వల్లే రాష్ట్రవ్యాప్తంగా సమగ్రశిక్ష కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం తదితర 9 రకాల విభాగాలకు చెందిన 25వేల మంది ఉద్యోగులు 16 రోజుల నుంచి సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించారు. సమ్మెలోకి దిగిన తరువాతే బకాయి పెట్టిన 3 నెలలకు గాను 2 నెలల వేతనాలను విడుదల చేశారన్నారు. ప్రధానంగా ఉద్యోగులందరికీ హెచ్ఆర్ పాలసీ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం, మినిమం టైమ్ స్కేల్, ఇతర డిమాండ్లపై నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చేంతవరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎస్పిడి, కెజిబివి సెక్రటరీ మధుసూదన్ లు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ, రాజ్యాంగ ఉల్లంఘనకు, కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారని విమర్శించారు. నంద్యాలలో డీఈవో, ఎంఈవోలు జనవరి మూడో తేదీ సావిత్రిబాయి పూలే 193 వ జయంతి అనే ఇంగితజ్ఞానం కూడా లేకుండా కెజిబివి ప్రిన్సిపాల్స్ ను , టీచర్లను భయబ్రాంతులకు గురిచేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడడాన్ని రాష్ట్ర జేఏసీ ఖండిస్తోందన్నారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర పధకాలైన ఉపాధిహామీ, వెలుగు, మెప్మా డిపార్ట్మెంట్లలో హెచ్ఆర్ పాలసీ అమలు జరుపుతుంటే, అదే కేంద్ర పధకమైన సమగ్రశిక్షా పథకంలో పనిచేసే ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయకుండా రాష్ట్ర అధికారులు అడ్డుపడుతున్నారని విమర్శించారు. మనందరి ఐక్యతతోనే డిమాండ్లు సాధించుకోగలమని ఉద్యోగులకు సూచించారు. పార్వతీపురం, కాకినాడ జిల్లాల్లో చట్టబద్ధంగా సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తామని నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఈ తాటాకు చప్పుళ్లను ఉద్యోగులు పట్టించుకోవాల్సిన అవసరంలేదని తెలిపారు. ప్రభుత్వానికి తొత్తులుగా ఉండే వ్యక్తులుచేసే ప్రచారం పట్టించుకోవద్దని, పోరాటాన్ని కొనసాగించమని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన చర్చల సారాంశాన్ని ఉద్యోగులకు వివరించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఏవోకి వినతిపత్రం అందించారు. ఈరోజు కార్యక్రమనికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జేఏసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.చంటిబాబు, సత్య నాగమణి, జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎంవి.సాయికిరణ్, ఎ. లోవరాజు, పివివి. మహాలక్ష్మి, ఎం.రాధాకృష్ణ, సహాయ కార్యదర్శులు కె.చంద్రశేఖర్, జి.నారాయణ, ఎంబి.సాల్మన్, జిల్లా కోశాధికారి పి.రాజు, కె.శ్రీనివాస్, ఎం.గంగాధర్ తదితరులు నాయకత్వం వహించారు.

➡️