దేహదానం చేసిన సురేశ్‌ ఆదర్శనీయుడు

Mar 14,2024 08:23 #JVV leader, #passed away

జెవివి ఘన నివాళి
ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తన జీవిత కాలంలో నిస్వార్థంగా సమాజ మార్పు కోసం కృషి చేసిన సురేశ్‌ తన మరణానంతరం కూడా దేహదానంతో మరింత గొప్ప ఆదర్శాన్ని నెలకొల్పారని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ కోయ వెంకటేశ్వరరావు, శ్రీనాథ్‌ పేర్కొన్నారు. శరీర దానంతో మనిషి జీవిత కాలాన్ని పెంచుదామనీ, మెడికల్‌ కాలేజీలకు అవయవ దానం చేస్తే మరింతమంది నైపుణ్యం కలిగిన వైద్యులు తయారవుతారని వారు తెలిపారు. తద్వారా మనం చనిపోయినా నలుగురికి విజ్ఞానాన్ని అందించడానికి ఉపయోగపడతామని చెప్పారు. దేహదానంతో వైద్య విద్యార్థులకు పాఠాలు నేర్పించవచ్చన్నారు.
జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య సబ్‌ కమిటీ కన్వీనర్‌ అనుమకొండ సురేశ్‌ బ్రెయిన్‌ క్యాన్సర్‌ బారినపడి మంగళవారం మరణించారు. ఆయన పార్థీవ దేహాన్ని తన అంతిమ కోరిక మేరకు సిద్దిపేటలోని సురభి వైద్య కళాశాలకు ఆయన కుటుంబ సభ్యులు అప్పగించారు. సురేశ్‌ పార్థీవ దేహాన్ని సురభి వైద్య కళాశాల అనాటమీ విభాగాధిపతి డాక్టర్‌ సమత రోష్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సురేశ్‌ భార్య పద్మ, కుమార్తె సునయన, అల్లుడు లోకనాథంను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా జెవివి రాష్ట్ర కమిటీ, పలు జిల్లా కమిటీలు సురేశ్‌ కు ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్‌ కోయ వెంకటేశ్వరరావు, శ్రీనాథ్‌ మాట్లాడుతూ… వైద్యరంగం దినదినాభివృద్ధి చెందుతుందని, వివిధ మానవ అవయవాల మార్పిడి చేయగల స్థాయికి వైద్య శాస్త్రం ఎదిగిందని గుర్తుచేశారు.

➡️