ఎయిర్‌ పోర్ట్‌లో శ్రీవాణి టికెట్స్‌ నిలిపివేత

ప్రజాశక్తి- తిరుమల :రేణిగుంట విమానాశ్రయంలోని శ్రీవాణి (శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం) దర్శన టికెట్‌ కౌంటర్‌ మార్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. డిసెంబరు 16 నుంచి తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో టికెట్ల జారీ చేయనున్నట్లు తెలిపింది. దేశ విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే విమాన ప్రయాణికుల సౌకర్యార్థం రేణిగుంట విమానాశ్రయంలో ప్రతి రోజు 100 ఆఫ్‌లైన్‌ శ్రీవాణి టికెట్లను టిటిడి జారీ చేస్తోంది. విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ల జారీకి అనుమతి లేని కారణంగా డిసెంబరు 16 నుంచి తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో జారీ చేయనున్నారు. ప్రతిరోజు 100 టికెట్లను బోర్డింగ్‌ పాస్‌తో యధావిధిగా శ్రీవాణి దర్శన ఆఫ్‌లైన్‌ టికెట్లను ఇవ్వడం జరుగుతుందని టిటిడి ఓ ప్రకటనలో పేర్కొంది.

➡️