ముందస్తు చర్యలు చేపట్టండి – జెఎన్‌-1 వైరస్‌పై సిఎం ఆదేశం

Dec 23,2023 09:03 #ap cm jagan, #sameeksha meeting

కోవిడ్‌ కొత్త వేరియంట్‌పై సమీక్ష

ప్రజాశక్తి-అమరావతి బ్యూరోకోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 విస్తరణ పట్ల అమ్రత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో శక్రవారం ఆయన వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యంత బలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్ధను ముందస్తు చర్యల కోసం అలర్ట్‌ చేయాలన్నారు. కొత్త వేరియంట్‌ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్‌ క్లినిక్స్‌ స్టాఫ్‌కు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సిఎం జగన్‌ ఆదేశించారు. అధికారులు మాట్లాడుతూ ఈ వైరస్‌ సోకినవారు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారని చెప్పారు. డెల్టా వేరియంట్‌ తరహా లక్షణాలు లేవని అధికారులు తేల్చారు. జెఎన్‌-1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని అధికారులు వివరించారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆసుత్రుల్లో పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్‌ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నామని తెలిపారు. కొత్త వేరియంట్‌ గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ పెడుతున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో పర్సనల్‌ కేర్‌ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వపరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్‌ ఇన్‌ఫ్రాను సిద్దం చేస్తున్నాయన్నారు. అక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, డి-టైప్‌ సిలిండర్లు కూడా సిద్దం చేశామన్నారు. 56,741 అక్సిజన్‌ బెడ్లు కూడ సిద్దం చేసినట్లు అధికారులు తెలిపారు. సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సిఎస్‌ జవహర్‌రెడ్డి, స్పెషల్‌ సిఎస్‌ కృష్ణబాబు, సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డిఎస్‌విఎల్‌ నరసింహం తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

➡️