ఇంటి వద్దకే పింఛన్లు – అమలుకు చర్యలు తీసుకోండి : చంద్రబాబు

– సెర్ప్‌ సిఇఒపై ఇసికి ఫిర్యాదు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం లేఖ రాశారు. పెన్షన్లు ఇంటింటికీ పంపిణీ చేయకుండా సెర్ప్‌ సిఇఒ మురళీధర్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఎండల్లో పింఛన్లు కోసం వృద్ధులు, వికలాంగులు కిలోమీటర్ల దూరం వెళ్లలేరని, ఇంటి వద్ద పింఛను అందించే ఏర్పాటు చేయాలని లేఖలో ఇసికి విజ్ఞప్తి చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్దనే పింఛన్లు పంపిణీ చేసేలా సెర్ప్‌ సిఇఒ మురళీధర్‌రెడ్డి.. లబ్ధిదారులను ఇబ్బందిపెట్టే ఆదేశాలివ్వడం వెనుక కుట్ర దాగి ఉందని పేర్కొన్నారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి సెర్ప్‌ సిఇఒ మురళీధర్‌రెడ్డి బంధువని, గతంలో సిఎం జగన్‌.. సిబిఐ కేసుల్లో ఇతను కూడా సహ నిందితుడుగా ఉన్నారని అన్నారు. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, సిఇఒ ముఖేష్‌కుమార్‌మీనా దృష్టికి చంద్రబాబు ఫోన్‌ ద్వారా తెలియజేశారు.

➡️