తమ్మారెడ్డి కృష్ణమూర్తి-కృష్ణవేణిల సంస్మరణ సభ

Apr 6,2024 16:36 #CPM AP, #cpm v srinivasarao

ఫిలింనగర్ : తమ్మారెడ్డి కృష్ణమూర్తి-కృష్ణవేణిల సంస్మరణ సభ శనివారం హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిచారు. తమ్మారెడ్డి కృష్ణమూర్తి-కృష్ణవేణిల కుమారుడు ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. 2020, ఏప్రిల్ 6న తమ్మారెడ్డి భరద్వాజ్ మాతృమూర్తి కృష్ణ‌వేణి అనారోగ్యంతో మృతి చెందారు.

తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి స్వాతంత్య్ర పోరాటంలో, కమ్యూనిస్టు ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 1949లో ఆయన మద్రాసు వెళ్లి సినీరంగ ప్రవేశం చేశారు. చిత్రసీమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలిరావడంతో ఆయన కూడా అక్కడకు వచ్చారు. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పేరిట ఓ సంస్థను నెలకొల్పి ఎన్నో అభ్యుదయ, సందేశాత్మక చిత్రాలను నిర్మించారు. లక్షాధికారి, జమీందార్, బంగారుగాజులు, ధర్మదాత, ఇద్దరు కొడుకులు, దత్తపుత్రుడు వంటి చిత్రాలు ఆయన నిర్మించినవే. సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2007లో రఘుపతి వెంకయ్య అవార్డు గెలుచుకున్నారు. రాష్ట్రంలో ప్రజానాట్యమండలి పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన కృష్ణమూర్తి తుది శ్వాస విడిచేవరకు ఆ సంస్థతోనూ, కమ్యూనిస్టు పార్టీతోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.

➡️