టీడీపీ కూటమి మేనిఫెస్టో విడుదల..

Apr 30,2024 14:26 #kutami
  • మహిళలు, రైతులు, నిరుద్యోగులపై వరాల జల్లు
    ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
    ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ (ఎన్డీఏ) కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌, బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్‌సింగ్‌లు మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇప్పటికే సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజల్లోకి వెళుతున్న ఎన్డీఏ కూటమి మరికొన్ని హామీలతో ఈ మేనిఫెస్టోను తయారు చేసింది. పలు కీలకమైన హామీలతో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి మేనిఫెస్టో 2024ను రూపొందించారు. ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో పింఛన్లు, మహిళలకు పథకాలపై ఫోకస్‌ పెట్టారు. సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలు ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లారు. వీటితో పాటుగా మెగా డీఎస్సీపై మొదటి సంతకం, సామాజిక పింఛను రూ.4 వేలకు పెంచడంతో పాటుగా.. ఇది 2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపచేస్తారు. వికలాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు..బీసీలకు 50 ఏళ్లకే పింఛను అందిస్తామన్నారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేస్తామని ఇప్పటికే ప్రకటించారు. యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి హామీలను ఇప్పటికే ఇచ్చారు. ‘తల్లికి వందనం’ కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం.. వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు వంటి హామీలు ఉన్నాయి. ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం.. నాణ్యమైన సామగ్రితో మంచి ఇంటి నిర్మాణం వంటి హామీలు కూడా చేర్చారు.ఇసుక ఉచితం.. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.. ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌.. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా.. భూ హక్కు చట్టం రద్దు.. కరెంటు ఛార్జీలు పెరగవు అంటున్నారు. చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200.. మర మగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ హామీని చేర్చారు. పెళ్లి కానుక కింద రూ.లక్ష అందజేత.. విదేశీ విద్య పథకం పునరుద్ధరణ.. పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం.. నాణ్యతలేని మద్యాన్ని అరికట్టి, ధరల నియంత్రణ వంటివి ఉన్నాయి. రైతులకు గతంలో టీడీపీ ప్రభుత్వం అందించిన రాయితీ పథకాల పునరుద్ధరణ.. ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ. చేనేతలకు ప్రత్యేక విధానాలు, పథకాలు కూడా ఉన్నాయి.టీడీపీ అధినేత చంద్రబాబు 11 నెలల క్రితమే రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో సూపర్‌ సిక్స్‌ పేరుతో మినీ మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. జనసేనతో పొత్తు ఖరారయ్యాక ఆ పార్టీతో సంప్రదించి మరికొన్ని హామీలను జోడించారు. టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు ఖాయమయ్యాక మూడు పార్టీల నేతలు ఉమ్మడి మేఫెస్టోపై కసరత్తు చేశారు. నేటి అవసరాలు తీరుస్తాం- రేపటి ఆకాంక్షలు నెరవేరుస్తాం అంటూ ఈ మేనిఫఎస్టోను రూపొందించారు. సమాజంలోని అన్నివర్గాల అభ్యున్నతి కోసం మరిన్ని కొత్త పథకాలను ఎన్డీఏ కూటమి ప్రకటించింది. 2014-2019 మధ్య టీడీపీ కొన్ని పథకాలను అమలు చేసింది.. అయితే వాటిలో నిలిచిపోయిన వాటిని మళ్లీ అమలు చేయాలని నిర్ణయించారు. అన్న క్యాంటీన్‌లు, పండుగ కానుకలు వంటివి ఉన్నాయి. టీడీపీ గతంలో ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ను ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రింట్‌, టీవీ, సోషల్‌ మీడియాలో ప్రకటనల రూపంలో విస్తఅత ప్రచారం కల్పిస్తున్నారు.
➡️