నేడు హస్తినకు బాబు

  •  పొత్తులపై బిజెపి నేతలతోచర్చలు? 
  • ఇప్పటికే ఢిల్లీలో పురందేశ్వరి, సోము వీర్రాజు
  • ఉండవల్లి నివాసంలో పవన్‌తో భేటీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఆయన గురువారం దేశ రాజధానికి వెళ్లనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పొత్తులపై బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ కానున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం సార్వత్రిక ఎన్నికల సీట్ల సర్దుబాటే ఈ భేటీలో కీలకాంశం. దీనికి సంబంధించిన కసరత్తును బిజెపి అగ్రనేతలు పూర్తి చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణలో పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల విషయమై స్పష్టత రావడంతో ఆంధ్రప్రదేశ్‌వైపు దృష్టి సారించినట్లు సమాచారం. దీనిలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ, సీనియర్‌ నాయకులు సోము వీర్రాజులు బుధవారమే ఢిల్లీకి వెళ్లి అగ్రనేతలను కలిశారు. మరోవైపు చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌లుకూడా బుధవారం నాడు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని బాబు నివాసానికి వెళ్లిన పవన్‌ కల్యాణ్‌ ఆయనతో దాదుపు ఒకటిన్నర గంటకు పైగా సమావేశమైనారు. టిడిపి- జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో తాజా సమావేశంలో రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బిజెపి కోరుతున్న సీట్లపైనే వీరిరువురు చర్చించినట్లు చెబుతున్నారు. అదే విధంగా ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో నెలకొన్న అసంతృప్తి, రెండవ విడత అభ్యర్థుల జాబితా తదితర అంశాలపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. రాష్ట్ర బిజెపి నేతలు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి ఉండటం, అదే సమయంలో చంద్రబాబు కూడా వెళ్తుండటంతో గురువారం నాటి సమావేశంలో ఎన్‌డిఎ కూటమిలో టిడిపి చేరే విషయంతో పాటు, సీట్ల సర్దుబాటుకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని సమాచారం. బిజెపి 9 శాసన సభ, 5 లోక్‌సభ స్థానాలను అడుగుతున్నట్లు తెలిసింది.

➡️