బిజెపి బెదిరింపులను టిడిపి ఎదుర్కోవాలి

  • ప్రత్యేక హోదాపై గళం విప్పినందుకే గల్లాపై ఇడి దాడులు : వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : బిజెపి బెదిరింపులను తెలుగుదేశం పార్టీ గట్టిగా ఎదుర్కోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. సోమవారం ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన సిపిఎం జిల్లా కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం ఎంపి గల్లా జయదేవ్‌ గళం విప్పినందుకే ఆయనపై బిజెపి కక్షపూరిత ధోరణితో ఇడిని ప్రయోగించిందన్నారు. బిజెపి ఒత్తిడితోనే ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలో గల్లా జయదేవ్‌ కుటుంబానికి చెందిన పరిశ్రమలను బయటకు నెట్టినట్లు స్పష్టమవుతోందని తెలిపారు. బిజెపి నిరంకుశ, కక్ష సాధింపు చర్యలను ఎదుర్కొనేందుకు టిడిపి ముందుకు రావాలని కోరారు. బిజెపి ఒత్తిడి, సూచనలు, సలహాలతోనే రాష్ట్రంలో జగన్‌ పాలన సాగిస్తున్నారని సిపిఎం మొదట నుంచీ చెబుతోందని గుర్తు చేశారు. ఇప్పటికైనా టిడిపితోపాటు ఇతర పార్టీలు ఈ వాస్తవాన్ని గుర్తించాలని కోరారు. ఒపిఎస్‌ను పునరుద్ధరించాలని కోరుతూ రాజమండ్రిలో యుటిఎఫ్‌ నిర్వహించిన ఉపాధ్యాయ సదస్సుకు వైసిపి, టిడిపి గైర్హాజరు కావడాన్ని శ్రీనివాసరావు తప్పుబట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు తమ ముఖం చూపించడానికి ఈ రెండు పార్టీలూ భయపడుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు షర్మిల గట్టిగా గళం విప్పడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా, పరిశ్రమలు రాకుండా చేస్తోన్న పాపం బిజెపిదేనన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో బిజెపిని, దానికి మద్దతుగా ఉన్న పార్టీలను ఓడించాలన్నారు.

‘వెలిగొండ’పై రైతులను మభ్యపెడుతున్న వైసిపి

వెలిగొండ ప్రాజెక్టుపై రైతులను వైసిపి మభ్యపెడుతోందని వి.శ్రీనివాసరావు విమర్శించారు. రెండు సొరంగాలు పూర్తి చేయడానికి 18 ఏళ్లు పట్టిందన్నారు. దీనికి సిగ్గుపడకపోగా ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండానే ఏదో సాధించామంటూ గొప్పలు చెప్పుకోవడం గర్హనీయమన్నారు. ఇప్పటికీ అప్రోచ్‌ ఛానళ్లు పూర్తి కాలేదని తెలిపారు. పునరావాసానికి అతీగతీ లేదని, నిర్వాసితులకు ప్యాకేజీలు అందలేదని చెప్పారు. నిర్వాసితులను ముప్పుతిప్పలు పెడుతున్నారని విమర్శించారు. పునరావాసం కల్పించకుండా, రైతులను గ్రామాల నుంచి ఖాళీ చేయించకుండా నీళ్లివ్వడం సాధ్యమా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను, ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ ప్రచారాలు సాగిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో అవసరమైన నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అన్ని పనులూ పూర్తి చేశాకే నీళ్లివ్వాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు పూనాటి ఆంజనేయులు పాల్గొన్నారు.

➡️