ఎపి ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తా – తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి

ప్రజాశక్తి -తిరుమల :ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శ్రీవారికి తన మనువడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎపిలో ఏర్పడే ప్రభుత్వంతో కలిసి సమస్యలు పరిష్కరించుకుని కలసికట్టుగా నడుస్తామన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఒకరికి ఒకరు సహకరించుకోవాలని ఆకాంక్షించారు. తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సత్రం, కళ్యాణ మండపం నిర్మిస్తామని ప్రకటించారు. శ్రీవారి సేవలో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యం కూడా తీసుకోవాలని ఎపి సిఎంకు విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

➡️