తెలంగాణ డబ్బు ఢిల్లీ పెద్దలకు చేరుతోంది : ప్రధాని మోడి

Mar 18,2024 12:21 #BJP, #PM Modi, #speech, #Telangana

జగిత్యాల (తెలంగాణ) : తెలంగాణ డబ్బు ఢిల్లీ పెద్దలకు చేరుతోందని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు. సోమవారం ఉదయం జగిత్యాలలో నిర్వహించిన బిజెపి విజయ సంకల్ప సభలో మోడి ప్రసంగిస్తూ … కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ లపై విమర్శలు సంధించారు. దేశంలో జరిగిన స్కామ్‌లన్నింటికి కుటుంబ పార్టీలే కారణమన్నారు. వికసిత్‌ భారత్‌ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారని చెప్పారు. తెలంగాణలో బిజెపి క్రమంగా బలపడుతోందన్నారు. తెలంగాణ ప్రజలు అబ్‌ కీ బార్‌ .. 400 పార్‌ అంటున్నారని ప్రధాని అన్నారు. ” నాకు ప్రతి మహిళా ఓ శక్తి స్వరూపం ” లా కనిపిస్తుందని, శక్తిని వినాశనం చేస్తానని ఎవరైనా అంటారా ? శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో.. జూన్‌ 4 న తెలుస్తుందన్నారు. తెలంగాణ నుండి డబ్బులు ఢిల్లీలో కుటుంబ పార్టీ పెద్దలకు వెళతాయన్నారు. తెలంగాణలో బిజెపికి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే .. తనకు అంత శక్తి వస్తుందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయం పెంచడం కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ ఒకరినొకరు కాపాడుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోడి విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బిజెపికి 400పైగా సీట్లు రావడం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. ” నేను భారతమాత పూజారిని ” అన్నారు. తెలంగాణ.. ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల అని కొనియాడారు. బిఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజలను దోచుకుందని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని తన ఏటీఎంగా మార్చుకుందని ఎద్దేవా చేశారు. ఒక దోపిడీదారు.. మరో దోపిడీదారుపై పోరాడలేరని ప్రజలకు తెలుసునన్నారు. బిఆర్‌ఎస్‌ దోపిడీపై కాంగ్రెస్‌ మౌనం వహిస్తోందన్నారు. తెలంగాణ డబ్బు ఇప్పుడు ఢిల్లీ చేరుతోందని నరేంద్ర మోడి చెప్పారు.

➡️