ఆయేషా హత్య కేసు దర్యాప్తు పురోగతి చెప్పండి.. సిబిఐకి హైకోర్టు ఆదేశం

high court on sand mining

ప్రజాశక్తి-అమరావతి : పెను సంచలనం రేకెత్తించిన బి-ఫార్మసీ విద్యార్థి ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తు ఏ దశకు చేరిందీ వివరించాలని సిబిఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి ఎపిలో విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద ఒక ప్రైవేట్‌ వసతి గృహంలో 2007 డిసెంబరు 27న జరిగిన ఆయేషా హత్య కేసు పురోగతిని వివరించాలని కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్‌, విశాఖలోని సిబిఐ ఎస్‌పిలను ఆదేశించింది. విచారణను 3 వారాలకు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ ఎన్‌ జయసూర్య చెప్పారు. ఆయేషా హత్య కేసు విచారణకు హాజరుకావాలని విశాఖ సిబిఐ నోటీసు ఇవ్వడాన్ని ఆ కేసులో నిర్దోషిగా బయటపడిన పి సత్యంబాబు హైకోర్టులో సవాల్‌ చేశారు. కింది కోర్టు విధించిన శిక్షను హైకోర్టు 2017 మార్చి 31న రద్దు చేసిందని పిటిషనరు తరఫున న్యాయవాది చెప్పారు. దోషులను గుర్తించి శిక్షించాలని ఆయేషా తల్లిదండ్రులు శంషాద్‌ బేగం, సయ్యద్‌ ఇక్బాల్‌ పాషా వేసిన కేసుల్లో హైకోర్టు 2018లో సిబిఐ దర్యాపునకు ఆదేశించిందన్నారు. కోర్టు అనుమతి లేకుండానే సత్యంబాబుకు డిఎన్‌ఎ పరీక్ష నిర్వహించారని న్యాయవాది తెలిపారు.

➡️