మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి

మాడుగుల (అనకాపల్లి) : వైద్య విద్య కోసం కిర్గిజ్‌స్థాన్‌ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృతి చెందిన ఘటన గత ఆదివారం జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు … అనకాపల్లి జిల్లా మాడుగులకు చెందిన హల్వా వ్యాపారి భీమరాజు రెండో కుమారుడైన దాసరి చందు (20) ఎంబిబిఎస్‌ చదవడానికి ఏడాది కిందట కిర్గిజ్‌స్థాన్‌కు వెళ్లాడు. పరీక్షలు ముగియడంతో యూనివర్సిటీ అధికారులు ఆదివారం విద్యార్థులను సమీపంలోని మంచు జలపాతం సందర్శనకు తీసుకువెళ్లారు. ఎపికి చెందిన అయిదుగురు విద్యార్థులు సరదాగా ఆ జలపాతంలో దిగారు. వారిలో చందు మంచులో కూరుకుపోయి మృతి చెందాడని సోమవారం మధ్యాహ్నం అతడి తల్లిదండ్రులకు సమాచారం అందింది. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడారని అనకాపల్లి ఎంపి సత్యవతి పేర్కొన్నారు.

➡️