పుంగనూరులో ఉద్రిక్తత

Apr 17,2024 21:44 #Clash, #Punganur, #TDP, #tension, #YCP
  • ఆర్‌పిలతో జానపద కళల అభివృద్ధి చైర్మన్‌ సమావేశం
  •  మంత్రి పెద్దిరెడ్డి నామినేషన్‌కు తరలిరావాలని ఆదేశాలు
  • టిడిపి నేత వీడియో చిత్రీకరించడంతో దాడి

ప్రజాశక్తి – పుంగనూరు (చిత్తూరు) : చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్‌ సందర్భంగా జనసేకరణ కోసం డ్వాక్రా రిసోర్స్‌ పర్సన్ల (ఆర్‌పి)తో బుధవారం సమావేశం నిర్వహించారు. సమావేశం నుంచి బయటకు వస్తున్న వారిని టిడిపి నేత వీడియో తీశారు. దీంతో వైసిపి నేతలు వీడియో తీసిన వ్యక్తిపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు పార్టీల నాయకలూ పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేశారు.
స్థానికుల వివరాల మేరకు.. శుక్రవారం మంత్రి పెద్దిరెడ్డి నామినేషన్‌ వేస్తున్న సందర్భంగా జనసమీకరణ బాధ్యతను పుంగనూరు మున్సిపల్‌ కేంద్రంలో ఆర్‌పిలను అప్పగించేందుకు వారితో రాష్ట్ర జానపద కళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం తన ఇంటిలో రహస్య సమావేశం నిర్వహించారు. సమావేశ అనంతరం ఒకొక్కరుగా ఆర్‌పిలు బయటకు రావడాన్ని టిడిపి నేత హేమాద్రి గమనించారు. ఆ సన్నివేశాలను తన మొబైల్‌ ఫోన్‌లో వీడియో, ఫొటోలు తీశారు. గమనించిన వైసిపి నాయకులు ఆయనపై మూకుమ్మడిగా దాడి చేశారు. విషయం తెలుసుకున్న టిడిపి పట్టణ నాయకులు నాగభూషణం ఇంటికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు టిడిపి నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వైసిపి నాయకులు కొండవీటి నాగభూషణం, జిల్లా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అమ్ము, నాయకులు జింక వెంకటచలపతి, సాయి, ఇర్ఫాన్‌, ప్రభు, అమ్ముకుట్టి, తుంగ మంజుపై టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని హేమాద్రిపై వైసిపి నాయకులు ఫిర్యాదు చేశారు.

➡️