బిల్డింగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డును పునరుద్ధరించాలి

  • కార్మికశాఖ మంత్రికి సిఐటియు వినతి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : బిల్డింగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డును పునరుద్ధరించాలని మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) కోరింది. మంత్రికి ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌వి నరసింహారావు సోమవారం వినతిపత్రం సమర్పించారు. గత నాలుగున్నరేళ్లలో బోర్డును నిర్వీర్యం చేశారని, ఇప్పటికైనా ఆదుకోవాలని మంత్రిని నాయకులు కోరారు. దీనికి స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అడ్డుగా ఉన్న 1214 జిఓను రద్దు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. అలాగే కార్మిక సంఘాలతో ఉమ్మడి సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. ఇసుక క్వారీల నిలుపుదల అంశాన్ని పరిష్కరిస్తామని చెప్పారు. కార్మికుల రెన్యువల్స్‌ను పునరుద్ధరిస్తామన్నారు. నమోదు చేసుకున్న కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇస్తామని పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు నాంపల్లి రమణరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి డిఎన్‌విడి ప్రసాద్‌, నాయకులు సుందరబాబు, ఈశ్వరరావు, స్కీం వర్కర్ల సంఘం నాయకులు కృష్ణవేణి తదితరులు ఉన్నారు.

➡️