విశాఖ ఉక్కు పరిరక్షణపై ముఖ్యమంత్రి స్పందించాలి

Jul 2,2024 21:57 #Dharna, #visaka steel plant

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు పరిరక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలని పోరాట కమిటీ నాయకులు వరసాల శ్రీనివాసరావు, డి.ఆదినారాయణ, రామ్మోహన్‌కుమార్‌, డేవిడ్‌, కె.శ్రీనివాస్‌, శ్రీనివాస్‌నాయుడు విజ్ఞప్తి చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 1237వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌ ఇఎస్‌ఎఫ్‌, ఇఆర్‌ఎస్‌, ఇఎండి, సేఫ్టీ, విభాగాల కార్మికులు కూర్చున్నారు. దీక్షలనుద్దేశించి నాయకులు మాట్లాడుతూ.. ప్లాంట్‌లో సాధారణ ఉత్పత్తి తీయడానికి సైతం రా మెటీరియల్‌ కొరత అత్యంత హీన స్థితికి చేరిందని, కేవలం రెండు, మూడు రోజులకు మాత్రమే నిల్వలు ఉన్నాయని తెలిపారు. త్వరితగతిన రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం స్పందించాలని కోరారు. ప్లాంట్‌ సమస్య శాశ్వత పరిష్కారం కోసం సెయిల్‌లో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ఏడు నెలలుగా సకాలంలో ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని స్థితిలోకి కంపెనీ నెట్టబడిందని తెలిపారు. ఈ పరిశ్రమ మరింత ఇబ్బందుల్లో పడితే లక్షలాది మంది ఉపాధి కోల్పోతారన్నారు. ఈ శిబిరంలో దాసరి శ్రీనివాస్‌, కె.కనకరాజు, గంగాధర్‌, రమణ, సదాశివరావు, తదితరులు కూర్చుకున్నారు.

➡️