దేశం ఆర్ధికంగా నలిగిపోతోంది

Apr 9,2024 00:53 #country, #crumbling, #economically
  • నోరు తెరిస్తే అసత్య ప్రచారాలు
  • రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌

ప్రజాశక్తి-తిరుపతి సిటీ : గత పదేళ్లుగా దేశం ఆర్ధికంగా నలిగిపోతోందని, అసమానతలు అధికమయ్యా యని, అసత్య ప్రచారాలతో ప్రజలను పాలకులు మభ్యపెడుతున్నారని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌ అన్నారు. ‘దేశం నిజంగా వెలిగి పోతుందా?’ అనే అంశంపై వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం సదస్సు జరిగింది. తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ సదస్సుకు ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం అధ్యక్షత వహించారు. పరకాల ప్రభాకర్‌ మాట్లాడుతూ.. దేశం ఆర్థికంగా కుంగిపోతుంటే పైకి మాత్రం వెలిగిపోతోందని పాలకులు చెప్పుకుంటున్నారని, ఇది భవిష్యత్‌ తరాలను మరింత ఊబిలోకి నెట్టడమేనన్నారు. ప్రతిపక్షాలు తనను 99 సార్లు తిట్టాయని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ లెక్కలు చెప్పారని, దేశంలో నిరుద్యోగత ఎంత? కోవిడ్‌ మరణాలు ఎన్ని? వైద్యం అందక చనిపోతున్న వారి సంఖ్య ఎంత? వలసల రూపంలో సుదూర రాష్ట్రాలకు పాదయాత్ర ద్వారా వెళుతున్న కార్మికులు ఎంతమంది అనే లెక్కలు ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. 2022 రైల్వే రిక్రూట్‌మెంట్‌ ప్రకటన ద్వారా ఏడో తరగతి చదివిన వారికి క్లీనింగ్‌ పనుల కోసం 35వేల పోస్టులను ప్రకటిస్తే, కోటి 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. అందులో డిగ్రీ చేసిన వారూ ఉన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా 82 శాతం మంది యువత నిరుద్యోగంతో ఉందని, నిత్యావసర ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు. గతంలో మాదిరి భారతదేశం ప్రకటించే లెక్కల్లో విశ్వసనీయత లేదని మన ఆర్థిక పరిస్థితిపై ప్రపంచంలోని వందమంది ఆర్థికవేత్తలు రాసిన లేఖలో వెల్లడించారన్నారు. సీనియర్‌ పాత్రికేయులు రాఘవశర్మ, ఐలు జిల్లా అధ్యక్షులు హేమచంద్ర, ప్రముఖ న్యాయవాది ఓంప్రకాష్‌, వేమన విజ్ఞాన కేంద్రం గౌరవాధ్యక్షులు టెంకాయల దామోదరం పాల్గొన్నారు.

➡️