సమస్యలు పరిష్కారం కాక ఆందోళనలో సచివాలయాల ఉద్యోగులు

Feb 22,2024 11:24 #secretariat employees

 ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :     రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్‌ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. ఎన్నికల కోడ్‌ విడుదలయ్యే సమయం సమీపించడంతో ఉద్యోగుల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి ఎన్ని వినతులు సమర్పించినా ఫలితం కనిపించకపోవడంతో రానున్న రోజుల్లో ఉద్యమం దిశగా అడుగులు వేయక తప్పదనే అభిప్రాయం ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్యావంతులైన ఉద్యోగులకు కేడర్‌మార్పు చేసి  జూనియర్‌ అసిస్టెంట్‌ పేస్కేల్‌ ఇవ్వాలని, విధుల్లో చేరిన మొదటి రోజు నుంచి నోషనల్‌ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.  ముందుస్తుగా సచివాలయాల్లో చేరిన ఉద్యోగులకు సంబంధించిన ప్రొబేషనరీ ఆలస్యంగా డిక్లేర్‌ చేసిన కాలానికి పేస్కేల్‌కు అనుగుణంగా అరియర్స్‌ ఇవ్వాలని, నాలుగు సంవత్సరాల సర్వీస్‌ పూర్తిచేసుకున్న అన్ని కేటగిరీల సచివాలయ ఉద్యోగులకు ఒకే విభాగంలో కాకుండావివిధ విభాగాల్లో (మల్లిపుల్‌ డైరెక్షన్‌) విద్యార్హత ప్రామాణికంగా ప్రమోషన్లు కల్పించాలని , కనీస పే స్కేల్‌ సీనియర్‌ అసిస్టెంట్‌కు తగ్గకుండా ప్రమోషన్లు కల్పించాలని గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

సింగిల్‌ విండో రిక్రూట్‌మెంట్‌ సిస్టిమ్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చేసి, ప్రతి రెండు సంవత్సరాలకు ఒక ప్రమోషన్‌ కల్పిస్తూ ప్రమోషన్ల ద్వారా ఉన్నత స్ధాయి వరకు ఉద్యోగులకు అవకాశాలు కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పరిపాలన అందించే అవకాశం కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. భేషరుతుగా ఉద్యోగులకు యూనిఫామ్‌ నిబంధన తొలగించాలని, సచివాలయాల పర్యవేక్షణ ఒకే అధికారి నియంత్రణలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు జాబ్‌ చార్ట్‌ కాకుండా ఇతరత్రా ఇతర పనులకు వినియోగించుకోకుండా జాబ్‌ చార్ట్‌ విధులకే పరిమితం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. క్షేత్రస్ధాయిలో విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్‌ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కూడా కోరుతున్నారు . వీటిని పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చినప్పటికీ ఆ దిశలో చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.

➡️