వైభవంగా గంగమ్మ జాతర

May 21,2024 21:55 #Gangamma fair, #The glorious

– మొక్కులు చెల్లించుకున్న యాత్రికులు, రాజకీయ నేతలు
ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ :తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం వైభవంగా జరిగింది. మొక్కులు తీర్చుకునేందుకు యాత్రికులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు తరలివచ్చారు. అమ్మవారిని వజ్ర కిరీటంతో అర్చకులు అలంకరించారు. గంగమ్మను టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, తిరుపతి మేయర్‌ శిరీష, డిప్యూటీ మేయర్‌ భూమన అభినరు రెడ్డి, తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు కుటుంబ సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబసభ్యులు దర్శించుకున్నారు. వారితో పాటు జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, తిరుపతి అర్బన్‌ ఎస్‌పి హర్షవర్ధన్‌ రాజు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఆదితి సింగ్‌ విచ్చేశారు. సుమారు 60వేల మంది యాత్రికులు ఆలయ సమీపంలో పొంగళ్లు సమర్పించారు. మేయర్‌ శిరీషతో కలిసి భూమన కరుణాకర్‌రెడ్డి స్వయంగా అన్నప్రసాద వితరణ చేశారు. గంగమ్మ జాతర సందర్భంగా స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు ఐచ్ఛిక సెలవు ప్రకటించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వారం రోజుల పాటు యాత్రికులు వివిధ వేషధారణలతో సందడి చేస్తున్నారు. ఈనెల 14న ప్రారంభమైన జాతర బుధవారం తెల్లవారుజాముతో ముగియనుంది.

➡️