గల్లంతైన మత్స్యకారులు క్షేమం

Apr 3,2024 21:52 #fishermens, #safe, #visakhapatnam

ప్రజాశక్తి -భోగాపురం, విశాఖ కలెక్టరేట్‌ :విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మత్స్యకారులు బుధవారం ఉదయం అప్పికొండ బీచ్‌ వద్ద క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో అధికారులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ముక్కాం గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు సోమవారం వేటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వారి ఫిర్యాదు మేరకు కోస్ట్‌ గార్డ్‌ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం వేకువజామున అప్పికొండ ప్రాంతంలో వారు ఉన్నట్లు గుర్తించారు. సముద్రంలో అలల తాకిడికి తమ బోటు బోల్తా పడినట్టు వారు చెప్పారు. దాన్ని యథాస్థితికి తెచ్చేందుకు ప్రయత్నించగా కుదరలేదని, దీంతో వలలు దాచుకునే ఓ కవర్‌ సహాయంతో తీరానికి చేరుకున్నామని తెలిపారు.
పలువురు పరామర్శ
క్షేమంగా ఒడ్డుకు చేరిన మత్స్యకారులను విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లోని మత్స్య శాఖ కార్యాలయానికి తీసుకువచ్చారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ అక్కడికి చేరుకొని వారిని పరామర్శించారు. వైసిపి ఎంపి అభ్యర్థి బత్స ఝాన్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, మత్స్యకార సంఘం నాయకులు పిసి.అప్పారావు, జనసేన దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ మత్స్యకారులను పరామర్శించిన వారిలో ఉన్నారు.

➡️