వృద్ధుడు సజీవ దహనం

Dec 17,2023 09:11 #death, #Fire Accident

ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం జిల్లా) :విజయనగరం జిల్లా వేపాడ మండలంలో వృద్ధుడు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బద్దాం గ్రామానికి చెందిన సిమ్మ నాగమయ్య (72) కొంతకాలంగా పక్షవాతంతో మంచం పట్టారు. ఇంటికి సమీపంలోని పశువుల పాకలో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి చలి ఎక్కువగా ఉండడంతో కుమార్తె ఆయన మంచం కింద కుంపటి పెట్టింది. ఈ నేపథ్యంలో మంచంపై ఉన్న దుప్పటి కుంపటిలో పడడంతో మంటలు చెలరేగాయి. దీంతో పాకకు నిప్పంటుకుని కాలిపోయింది. ఆ సమయంలో పాకలో ఉన్న పశువులు బయటకు పారిపోయాయి. పక్షవాతంతో కదల్లేని స్థితిలో ఉన్న నాగమయ్య మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. నాగమయ్య భార్య సన్యాసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాజేష్‌ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శృంగవరపుకోట సిహెచ్‌సికి తరలించారు.

➡️