‘నాగలి కూడా ఆయుధమే’ వైవిధ్యమైన కవిత్వశిల్పం

Mar 17,2024 21:45 #books, #Kurnool, #release
  •  ప్రముఖ సాహితీవేత్త కోయి కోటేశ్వరరావు

ప్రజాశక్తి – కర్నూలు కల్చరల్‌ : కొమ్మవరపు విల్సన్‌ రావు రాసిన వైవిధ్యమైన కవిత్వ శిల్పం ‘నాగలి కూడా ఆయుధమే’ అని ప్రముఖ సాహితీవేత్త, హైదరాబాద్‌ సిటీ కళాశాల తెలుగు శాఖాధిపతి డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు ప్రశంసించారు. కర్నూలు నగరంలోని లలిత కళా సమితి ఆడిటోరియంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ‘నాగలి కూడా ఆయుధమే’ పరిచయ సభ జరిగింది. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు అధ్యక్షత వహించిన ఈ సభలో కోటేశ్వరరావు పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కవిత్వం రాయడం ఒక కళ అని, భావాల అలలు, అనుభవాల ఉప్పెనలతో జతగట్టి గొప్ప కవిత్వం సమాజంలో పురుడుపోసుకుంటుందని, అటువంటి కవిత్వమే ‘నాగలి కూడా ఆయుధమే’ అని పేర్కొన్నారు. విశిష్ట అతిథి కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత ‘దండకడియం’ తగుళ్ల గోపాల్‌ మాట్లాడుతూ కొమ్మవరపు కవిత్వంలో అనేక పార్శ్వాలున్నాయని, సామాన్యుని బతుకు చిత్రం ఇందులో కనబడుతుందన్నారు. ఈ కవిత్వం సామాజిక ప్రయోజనాన్ని కాంక్షిస్తుందని తెలిపారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శు కెంగార మోహన్‌, రఘుబాబు మాట్లాడుతూ వైవిధ్యంగా వస్తువును దర్శించడం, శిల్పంలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం కొద్దిమందికే సాధ్యమవుతుందని, అది కొమ్మవరపు విల్సన్‌ కవికే సాధ్యమని పేర్కొన్నారు. వస్తువును ఎన్నుకోవడం, కవిచూసే దృష్టికోణం, రసోద్దీపనం కలిగించే పతాక స్థాయి, కవిత్వంలో ఎత్తుగడ వంటి ప్రధాన అంశాలు మాత్రమే పాఠకుల హృదయాన్ని తాకుతాయన్నారు. సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవు చక్రపాణి యాదవ్‌, నాయకులు విజయులు తనగల, కవులు టి వెంకటేష్‌, మారుతీ పౌరోహితం, డాక్టర్‌ అరుణ, గుంపుల వెంకటేశ్వర్లు, ఇనాయతుల్లా, ఎవి రెడ్డి, విశ్వనాథరెడ్డి, డా హరికిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️