విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  • విద్యుత్‌ స్ట్రగుల్‌ కమిటి మహాధర్నాలో ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌రంగంలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అమలు చేయాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. సోమవారం విజయవాడలోని ధర్నా చౌక్‌లో ఎపి విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ స్ట్రగుల్‌ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్‌ సంస్థలన్నింటిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మహాధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యుత్‌ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌లను తక్షణం పరిష్కరించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న పోరాటాలకు పిడిఎఫ్‌ అండగా వుంటుందని అన్నారు. ఈ ధర్నానుద్దేశించి ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, ఎపి విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ స్ట్రగుల్‌ కమిటి చైర్మన్‌ పి సుదర్శన్‌రెడ్డి, జనరల్‌ సెక్రటరి వి సుబ్బి రెడ్డి, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావులు మాట్లాడారు. విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు, అవుట్‌సోర్సింగ్‌, ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని వారు కోరారు. పర్మనెంట్‌ ఉద్యోగులు చేస్తున్న పనినే కాంట్రాక్టు కార్మికులు చేస్తుంటే ఉద్యోగులతో సమానముగా వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు వున్నా విద్యుత్‌ సంస్థల్లో అమలుకావడం లేదన్నారు.అలాగే కాంట్రాక్టు కార్మికులకు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వున్న వేతనభేదాలను తొలగించాలని కోరారు. విద్యుత్‌ సంస్థల్లో ప్రమాదకరమైన పనులు చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు అతితక్కువ వేతనాలను ఇస్తున్నారని అన్నారు. విద్యుత్‌ సంస్థల్లో వున్న థర్డ్‌ పార్టీ విధానంతో కార్మికులకు పూర్తిగా అన్యాయం జరుగుతోందని, తక్షణం థర్డ్‌పార్టీ విధానాన్ని రద్దు చేసి యాజమాన్యాలే నేరుగా వేతనాలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఉద్యోగులకు పిఆర్‌సి బకాయిలను, అరియర్స్‌ను చెల్లించాలని కోరారు. అలాగే పెండింగ్‌లో వున్న మూడు డిఎలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అలాగే విద్యుత్‌ కార్మికులందరికీ నగదురహిత వైద్యసౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్‌ చేశారు. అలాగే కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ రూ 10లక్షల గ్రాట్యుటిని చెల్లించాలని అన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పదన్నోతలను సక్రమంగా అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ స్ట్రగుల్‌కమిటి నాయకులు సూరిబాబు, ఎం మోహన్‌రావు, బి గంగయ్య , రాజు, చంద్ర శేఖర్‌, రసూల్‌ తదితరులు మాట్లాడారు.

➡️