వాలంటీర్లతో ఫించన్లు వద్దు

-వారి వద్ద ఉన్న ఫోన్లు, ట్యాబులు వెనక్కి
-ఇతర ‘సంక్షేమ’ పంపిణీలకు దూరంగా ఉంచండి
ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లపై పలు ఆంక్షలు విధించింది. వాలంటీర్ల విధుల్లో అత్యంత కీలకమైన ఫించన్ల పంపిణీ నుండి వారిని పక్కన పెట్టింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించవద్దని ఆదేశించింది. ఫించన్లతో పాటు వాలంటీర్ల చేతుల మీదుగా నగదు పంపిణీ చేసే అన్ని ఇతర సంక్షేమ పథకాల్లోనూ ఎన్నికల కోడ్‌ ముగిసేంత వరకు వారిని దూరంగా ఉంచాలని పేర్కొంది. ఫించన్లతో ఇతర సంక్షేమ పథకాల నగదు పంపిణీ బాధ్యతను ప్రభుత్వ ఉద్యోగులకు అప్పగించాలని ఆదేశించింది. అదే విధంగా ఎన్నికల కోడ్‌ ముగిసేంత వరకు వాలంటీర్లకు ప్రభుత్వం అందచేసిన మొబైల్‌ ఫోన్‌, ట్యాబ్‌లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఎవైనా ఉంటే వాటన్నింటిని వెనక్కి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ ముగిసేంత వరకు ఎన్నికల అధికారులు వాటిని తమ వద్ద డిపాజిట్‌ చేసుకోవాలని పేర్కొంది. సోమవారం ( ఏప్రిల్‌ 1) నుండి ఫించన్ల పంపిణీ జరగాల్సి వుండగా శనివారం సాయంత్రం ఈ ఆదేశాలు వెలువడటం గమనార్హం. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ 23.02.24, 25.02.24న హైకోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా హైకోర్టు 13.03.2024 ఆదేశాలకు లోబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం లోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏప్రిల్‌ నెలలో ఫించన్ల పంపిణీ జాప్యం అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 2.56 లక్షల మందికిపైగా వాలంటీర్లు ఎన్నికల కోడ్‌ ముగిసేంత వరకు విధులకు దూరమైనట్టే! వాలంటీర్లు తమ పార్టీ కార్యకర్తలేనంటూ అధికార పార్టీ నేతలు పలు సభల్లో చెప్పడంతో ఎన్నికల సమయంలో వారి విధులపై పలు అనుమానాలు, విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషన్‌కు కూడా పలు ఫిర్యాదులు అందాయి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశాల మేరకు వీరి కదలికలపై అధికారయంత్రాంగం నిఘా పెట్టింది. అధికారపార్టీ ప్రచార పర్వంలో భాగస్వాములుగా మారిన దాదాపు 100 మంది వాలంటీర్లను ఇప్పటికే విధుల నుండి తొలగించింది. ఈ నేపథ్యంలో విడుదలైన సిఇసి ఆదేశాలపై పలు రాజకీయ పక్షాలు హర్షాన్ని ప్రకటిస్తున్నాయి.
డిఎస్‌సి పరీక్షలు, టెట్‌ ఫలితాలు వాయిదా
రాష్ట్రంలో డిఎస్‌సి పరీక్షల నిర్వహణను, టెట్‌ ఫలితాల విడుదలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఎన్నికల కోడ్‌ ముగిసేంత వరకు వీటిని వాయిదా వేయాలని తాజా ఉత్తర్వుల్లోపేర్కొంది. రాష్ట్రప్రభుత్వం 6,100 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 12వ తేదిన నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పరీక్షలు మార్చి 30 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, వెబ్‌సైట్‌లో పరీక్షా కేంద్రాల ఎంపికకు కూడా అవకాశం ఇవ్వలేదు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు డిఎస్‌సిని వాయిదా వేస్తున్నట్లు ఆదేశాలు వెలువడటంతో ఆ ఉత్కంఠ వీడింది.

➡️