ఫుడ్‌ప్యాట్స్‌ కార్మికుల విజయం తథ్యం

  • సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు

ప్రజాశక్తి -తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా) : వేతన ఒప్పందం కోసం ఫుడ్‌ఫ్యాట్స్‌ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు అభినందనీయమని, కార్మికులు మరింత ఐక్యంగా, పట్టుదలతో పోరాడితే విజయం తథ్యమని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు అన్నారు. వేతనం ఒప్పందంపై యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ 3ఎఫ్‌ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌, సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఫుడ్‌ఫ్యాట్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరాయి. దీక్షా శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్‌, జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌.రంగారావు, ఎఫ్‌ఐటియు రాష్ట్ర నాయకులు మూర్తి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. 14 నెలలుగా వేతన ఒప్పందం అమలు చేయకుండా 3ఎఫ్‌ యాజమాన్యం కాలయాపన చేయడాన్ని ఖండించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా, వేతన ఒప్పందం 2023 మార్చిలోనే ముగిసినా ఎందుకు కొత్త ఒప్పందం చేయడంలేదని యాజమాన్యాన్ని నిలదీశారు. వేతన ఒప్పందం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అమలు చేయాలని కోరారు. వేతన ఒప్పందంపై యాజమాన్యంతోనూ, ఏలూరు లేబర్‌ అధికారులతోనూ దఫదఫాలుగా చర్చలు జరిగాయని తెలిపారు. 3ఎఫ్‌ యాజమాన్యం మొండివైఖరి వీడకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎఫ్‌ఐటియు రాష్ట్ర నాయకులు మూర్తి మాట్లాడుతూ 3ఎఫ్‌ కార్మికులు చేపట్టిన పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

➡️