జ్యూట్‌మిల్లు మళ్లీ మూత- రోడ్డున పడిన కార్మికులు

Jun 25,2024 23:47 #closed again, #Jute mill

ప్రజాశక్తి-నెల్లిమర్ల (విజయనగరం జిల్లా) :విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని జ్యూట్‌ మిల్లు అకారణంగా మూతబడింది. నెలలో రెండు వారాలు పనిచేస్తే మరో రెండు వారాలు ఇష్టానుసారం మూసివేసి కార్మికులను యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తోంది. సుమారు రెండు వేల మంది పర్మినెంట్‌, కాంట్రాక్టు (పొడికూలి) కార్మికులు ఈ మిల్లులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ముడి సరుకు కొరత పేరిట యాజమాన్యం జ్యూట్‌ మిల్లును అక్రమంగా మూసివేసిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలో రెండుమూడుసార్లు మిల్లు మూతబడడంతో కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గత కొన్నేళ్లుగా జ్యూట్‌ యాజమాన్యం తాము చెప్పిందే వేదంగా మిల్లును నడుపుతూ ఇఎస్‌ఐ, పిఎఫ్‌ వంటి కంట్రీబ్యూషన్‌ ప్రభుత్వానికి చెల్లించకుండా నిర్లక్ష్యం వహించినా కార్మికులు ఓపికతో పని చేస్తున్నారు. ముడిసరుకు కొరత కారణంగా మిల్లును మూసివేసినట్లు యాజమాన్యం చెబుతోంది. గత కొన్నేళ్లుగా ఇఎస్‌ఐ, పిఎఫ్‌ బకాయిల చెల్లించకుండా యాజమాన్యం నిర్లక్ష్యం చేయడంతో మిల్లులో పనిచేస్తున్న కార్మికులు, రిటైర్డు కార్మికులు పిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యాలు పొందలేకపోతున్నారు. 2016 నుంచి గ్రాడ్యూటీ బకాయిలు కూడా జ్యూట్‌ యాజమాన్యం చెల్లించలేదు సరికదా చెక్కులు ఇచ్చినప్పటికీ ఖాతాలో నగదు లేకపోవడం అవి చెల్లకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వమైనా జ్యూట్‌ మిల్లు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

➡️