ప్రపంచం కడప వైపు చూస్తోంది – పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల

May 9,2024 21:52 #speech, #ys sharmila

ప్రజాశక్తి-వేంపల్లె/లింగాల (వైఎస్‌ఆర్‌ జిల్లా) :కడపలో న్యాయం గెలుస్తుందా? నేరం గెలుస్తుందా అని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల అన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని పలు మండలాల్లో గురువారం ఆమె ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో షర్మిల మాట్లాడుతూ కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని కోరారు. అవినాష్‌రెడ్డి పదేళ్లు ఎంపిగా ఉన్నా కడప ఉక్కు పరిశ్రమ గురించి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ఉక్కు పరిశ్రమ వైఎస్‌ఆర్‌ కల అని పేర్కొన్నారు. వైజాగ్‌కు ఉక్కు పరిశ్రమ ఎట్లానో రాయలసీమకు కడప ఉక్కు పరిశ్రమ అంతే ప్రాధాన్యత ఉందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ సిబిఐ కేసుల నుంచి బయటపడేందుకు డిల్లీకి పోతున్నాడని, కడప ప్రజల కోసం ఒక్కనాడూ పోలేదని విమర్శించారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్‌రెడ్డి నిందితుడని సిబిఐ చేసిన ఆరోపణల ప్రకారమే మాట్లాడుతున్నామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని జగన్‌ నెరవేర్చలేదని విమర్శించారు. ఒకప్పుడు జగన్‌ కోసం ఇల్లు, వాకిలి, పిల్లలను వదిలి పెట్టి తాను 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డానన్నారు. వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత మాట్లాడుతూ న్యాయం కోసం పోరాటం చేస్తున్నామన్నారు. ఈ పోరాటంలో కోర్టు తీర్పు చాలా ఆలస్యం అవ్వొచ్చు గాని, ప్రజా తీర్పు చాలా పెద్దదని చెప్పారు. ప్రజా తీర్పు కోసం షర్మిల ఎంపిగా పోటీ చేస్తుందని తెలిపారు. న్యాయం వైపు ఆమె నిలబడిందన్నారు. అవినాష్‌రెడ్డి కనీసం ఓటు అడిగే పరిస్థితి లేదన్నారు. కడపలో ఉండి పాలించే నాయకుడు కావాలి, జైల్లో ఉండే నాయకుడు అవసరం లేదన్నారు. కార్యక్రమంలో పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌ తులసిరెడ్డి, పులివెందుల కాంగ్రెస్‌ అభ్యర్థి ధృవకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️