రాష్ట్రంలో బిజెపి, జనసేన ఉనికేలేదు..

  • పొత్తులకు భయపడేది లేదు : మంత్రి బొత్స

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : రాష్ట్రంలో బిజెపి, జనసేన పార్టీల ఉనికే లేదని, ఎన్నికల తర్వాత టిడిపి కనపడకుండా పోతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టిడిపి, జనసేన, బిజెపి పొత్తుపై భయపడేది లేదని, రానున్న ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. విశాఖలోని తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాపట్ల జిల్లా మేదమెట్ల సిద్ధం సభకు వచ్చిన జనం ప్రతిపక్షాలకు కనబడలేదని, కొన్ని పత్రికలు సిద్ధం సభకు వచ్చిన వారు గ్రాఫిక్స్‌ అనే భ్రమల్లో ఉన్నారని విమర్శించారు.గత పది రోజులుగా చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలు చూస్తున్నామన్నారు. బిజెపితో పొత్తు కోసం వెంపర్లాట, ఏం కావాలంటే అదే ఇస్తామని బిజెపికి దాసోహమవుతూ చంద్రబాబు వారి కాళ్ల వద్ద మోకరిల్లాడని విమర్శించారు. బిజెపి-టిడిపి పొత్తుకు ముందు ఒకరి గురించి ఒకరు మాట్లాడినవి వారు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరని అన్నారు. అధికారం కాదు ప్రజా సంక్షేమం ముఖ్యమన్న నాయకుడు జగన్‌మోహన్‌ రెడ్డి అని పేర్కొన్నారు. పొత్తుకు భయపడకుండా 175కి 175 వస్తాయి అని ధీమాతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వ హయంలో ప్రజల ఆదాయం పెరిగిందని, రైతులకు పెట్టుబడులు పెరిగాయని, ప్రజల దగ్గరకి సచివాలయం ద్వారా పాలనా వెళుతోందని, పిల్లల భవిష్యత్తుకు భరోసా లభించిందని చెప్పారు.

➡️