మూడు క్రిమినల్‌ చట్టాల అమలు నిలిపివేయాలి

Jul 2,2024 07:25 #cpm, #suspended, #Three criminal laws
  • సిపిఎం కేంద్ర కమిటీ డిమాండ్‌

ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండా హడావుడిగా ఆమోదింపజేసుకున్న మూడు క్రిమినల్‌ చట్టాల అమలును నిలిపివేయాలని సిపిఎం కేంద్ర కమిటీ డిమాండ్‌ చేసింది. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, ప్రతిపక్ష ఎంపీలను మూకుమ్మడిగా బహిష్కరించి ఈ చట్టాలు ఆమోదింప జేసుకున్న విషయాన్ని కేంద్రకమిటీ గుర్తుచేసింది. జూన్‌28 నుండి 30వరకు ఢిల్లీలో మూడు రోజులపాటు సమావేశమైన కేంద్ర కమిటీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. దేశ ద్రోహంపై ఐపిసి సెక్షన్‌ 124ఎ ని సుప్రీం కోర్టు కొట్టేసింది. అయితే, దానిని భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 156 ద్వారా కొత్త చట్టంలో ప్రభుత్వం చొప్పించింది. ఇది సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ఉల్లంఘించడమే కాకుండా ఎవరినైనా సులభంగా దేశ ద్రోహులుగా ముద్ర వేయడానికి వీలు కల్పిస్తుంది. పౌరులకు హాని కలిగించే విస్తృతాధికారాలను ఈ కొత్త చట్టాలు పోలీసులకు కల్పిస్తున్నాయి. పాత చట్టం ప్రకారం 15 రోజులు మాత్రమే రిమాండ్‌కు న్యాయమూర్తి ఆదేశించగలరు. ఇప్పుడీ కొత్త చట్టం ప్రకారం 90 రోజుల వరకు రిమాండ్‌కు ఆదేశించవచ్చు. పదిహేను రోజుల పాటు దర్యాప్తు జరిపిన తరువాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. యుఎపిఎ(ఉపా) చట్టంలోని అనేక నిబంధనలు ఆందోళనకరంగా ఉన్నాయి. పాత చట్టం ప్రకారం ప్రభుత్వం ఇచ్చే ప్రాసిక్యూషన్‌ అనుమతితో సీనియర్‌ పోలీస్‌ అధికారి మాత్రమే ఈ కేసులను దర్యాప్తు చేయాలి. ఇప్పుడీ అధికారాన్ని సాధారణ పోలీస్‌ అధికారికి ఇచ్చారు.. నేరం జరిగినప్పుడు అమలులో ఉన్న చట్టం ప్రకారం తప్ప ఎవరినీ శిక్షించకూడదనేది ప్రాథమిక న్యాయ సూత్రం. జులై ఒకటి కన్నా ముందు నమోదయిన ఎఫ్‌ఐఆర్‌లకు పాత చట్టం వర్తిస్తుంది. ఆ తరువాత ఎఫ్‌ఐఆర్‌లకు కొత్త చట్టం వర్తిస్తుంది. ఒకే సమయంలో రెండు చట్టాలు అమలులో ఉండడం వల్ల వివాదాలు ఏర్పడతాయి. అప్పీళ్లను క్లిష్టతరం చేస్తుంది. కేసుల బ్యాక్‌లాగ్‌కు ఇది దారి తీస్తుంది. అనిశ్చితికి దారి తీసే ఈ అస్పష్టమైన నిబంధనలు ఆమోదయోగ్యం కాదని కేంద్ర కమిటీ పేర్కొంది. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా బార్‌ అసోసియేషన్లు, పౌర సంస్థలు లేవనెత్తిన వైఖరికి మద్దతు పలికింది. వివిధ వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని వారిలో నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేవరకు ఇటువంటి అణచివేత చట్టాల అమలును నిలిపివేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. భారత రాజ్యాంగాన్ని, లౌకక ప్రజాస్వామ్య నిర్మాణాన్ని పరిరక్షించే పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. సమాఖ్య వ్యవస్థ, పౌర హక్కుల కోసం కూడా పోరాడాలి. దేశ పౌరుల్లో చాలా మంది జీవనోపాధికి సంబంధించిన తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. వీటికోసం పార్లమెంటు లోపల, బయటా పోరాటం సాగిస్తామని తెలిపింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను కేంద్ర కమిటీ సమావేశంలో కూలంకషంగా విశ్లేషించారు. ఎన్నికల్లో సిపిఎం ఫలితాలపైనా చర్చించారు. లోపాన్ని ప్రత్యేకంగా గుర్తించామని కేంద్ర కమిటీ తెలిపింది. లోటుపాట్లను అధిగమించి పార్టీ బలోపేతానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించన్నుట్లు తెలిపింది.

ఏప్రిల్‌లో అఖిల భారత మహాసభ
2025 ఏప్రిల్‌లో సిపిఎం 24వ అభిల భారత మహాసభ నిర్వహించాలని పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. దీనికి ముందు అన్ని స్థాయిల్లో పార్టీ మహాసభలు ఈ ఏడాది సెప్టెంబరు నుండి జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన టైమ్‌ టేబుల్‌ను కేంద్ర కమిటీ ఆమోదించింది.

➡️