నేడు సీతారాముల కల్యాణం

ప్రజాశక్తి – ఒంటిమిట్ట (వైఎస్‌ఆర్‌ జిల్లా) : బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండ రాముని కల్యాణానికి ఆలయ ప్రాంగణం విద్యుత్తు దీపాలు, ఆకాశమంత పందిళ్లతో కళకళలాడుతోంది. ఏకశిలానగరిలో సోమవారం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు నిర్వహించనున్న సీతారాముల కల్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రం నలుమూలల నుంచి రాములవారి కల్యాణానికి యాత్రికులు, సేవకులు ఒంటిమిట్టకు చేరుకున్నారు. ఆలయంలోని దత్తమండపం, ధ్వజస్తంభం, కల్యాణవేదిక విద్యుత్తు కాంతులతో కల్యాణశోభను సంతరించుకుంది. టిటిడి అధికారులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.

మోహినీ రూపంలో శ్రీరాముడు
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం మోహినీ అలంకారంలో శ్రీరాముడు దర్శనమిచ్చారు. ఉదయం 7.30 నుండి వైభవంగా స్వామివారి ఊరేగింపు జరిగింది. కేరళ డ్రమ్స్‌, చెక్కభజనలు, కోలాటాలతో, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి యాత్రికులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5.00 గంటల నుండి ఊంజలుసేవ, రాత్రి 7 నుండి గరుడ వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ధార్మిక, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇఒ నటేష్‌బాబు, సూపరింటెండెంట్లు హనుమంతయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌, విశేష సంఖ్యలో యాత్రికులు పాల్గొన్నారు.

➡️