వడదెబ్బతో ఇద్దరు మృతి

ప్రజాశక్తి- మక్కువ (పార్వతీపురం మన్యం జిల్లా), వేపాడ (విజయనగరం) :విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో శుక్రవారం వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం చెముడు గ్రామానికి చెందిన కరణం కూర్మి నాయుడు (67) శుక్రవారం ఉదయం పొలం పనిచేస్తున్న కొద్దిసేపటికి అపస్మారక స్థితికి చేరుకున్నారు. పక్కనే అరటి తోటలో పనిచేస్తున్న రైతులు వచ్చి చూడగా అప్పటికే ఆయన మృతి చెందారు. మృతదేహాన్ని కూర్మినాయుడి ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.
విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం గొల్జాం గ్రామానికి చెందిన తూర్పాటి సూరిబాబు (36) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం తన స్వగ్రామం వెళ్తుండగా వేపాడ మండలం పాటూరు సమీపంలో ఓ చికెన్‌ సెంటర్‌ వద్ద వడదెబ్బకు గురై స్పృహ కోల్పోయారు. గమనించి స్థానికులు సపర్యలు చేసినప్పటికీ సూరిబాబు అప్పటికే మృతి చెందాడు. ఎస్‌ఐ రాజేష్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని లక్కవరపుకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
గత మూడు రోజులుగా ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. 43 డిగ్రీల నుండి 45 డిగ్రీల వరకు తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది.

➡️