నీట్‌ కు తెనాలిలో రెండు పరీక్ష కేంద్రాలు

May 3,2024 14:14 #examination centers, #NEET, #Tenali

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ఈ నెల 5న జరిగే నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌ )కు తెనాలిలో రెండు పరీక్ష కేంద్రాలు కేటాయించినట్లు సిటీ కోఆర్డినేటర్‌, వెస్ట్‌ బెర్రీ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ టీవీ సుబ్రహ్మణ్యం చెప్పారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని వెస్ట్‌ బెర్రీ స్కూల్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ … నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో నీట్‌ పరీక్ష రాసేందుకు 337 మంది విద్యార్థులకు తెనాలి వెస్ట్‌ బెర్రీ స్కూల్‌, వివేకానంద స్కూల్‌ పరీక్ష కేంద్రాలుగా కేటాయించినట్లు చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తారన్నారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలు దాటిన తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేశారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు అడ్మిట్‌ కార్డు తో పాటు రెండు పాస్పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు, ఒక కార్డ్‌ సైజు ఫోటో, ఆధార్‌, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి ఏదైనా ఒక ఒరిజినల్‌ గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరు కావాలన్నారు. విద్యార్థులు సాధారణ దుస్తులు మాత్రమే ధరించాలని మందపాటి చెప్పులు, మెటల్‌ బటన్స్‌ కానీ, ఆభరణాలు గాని అనుమతించరని చెప్పారు. స్మార్ట్‌ వాచ్‌, స్మార్ట్‌ ఫోన్‌, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు ఏవి అనుమతించరన్నారు. విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ముందు రోజే సరి చూసుకోవాలని అది పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవడానికి దోహదం చేస్తుందన్నారు. పరీక్ష సజావుగా సాగేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలన్నారు.

➡️