దిశను మార్చుకున్న మిచౌంగ్‌ తుఫాన్‌

అమరావతి : మిచౌంగ్‌ తుఫాన్‌ తన దిశను మార్చుకున్నది. ప్రస్తుతం సూళ్లూరుపేట వద్ద కేంద్రీకృతమైంది. మంగళవారం రాత్రి 10 గంటల నుండి 12 గంటల లోపు నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్‌ తీరం దాటిన తర్వాత భూమి మీద నిదానంగా ప్రయాణిస్తూ ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ మీదుగా పయనించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఈ తుఫాను ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మందపల్లి గ్రామంలో విపరీతమైన ఈదురు గాలులతోకూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు-బాపట్ల జిల్లాల మధ్య తుఫాన్‌ తీరం దాటుతుండటంతో జిల్లాలో ఎడతెరపి లేకుండా కుండపోత వానలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల దెబ్బకు నెల్లూరు జిల్లాలోని పోదలకూరు, రాపూరు, చేజర్ల, కలువాయి మండలాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్‌ వైర్లు తెగి పడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. రెవెన్యూ సిబ్బంది, విద్యుత్‌ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొని చెట్లను తొలగిస్తున్నారు

➡️