కూటమిలో తగ్గని అసమ్మతి సెగలు

Mar 29,2024 23:41 #alliance, #Unrelenting discord

-పలుచోట్ల కొనసాగుతున్న నిరసనలు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :టిడిపి,జనసేన, బిజెపి కూటమిలో అసమ్మతి తగ్గడం లేదు. ప్రతి రోజూ ఏదో చోట నిరసనలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా తెలుగుదేశం పార్టీ చివరి అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో పలు అసమ్మతి రగులుకుంది. పెద్దఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. అనంతపురం అర్భన్‌ టిక్కెట్‌ను దగ్గుబాటి ప్రసాద్‌కు కేటాయించడంతో టిడిపి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి గ్రూపునకు చెందిన వారు తీవ్రస్థాయిలో నిరసనలకు దిగారు. చంద్రబాబు , లోకేష్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ కార్యాలయంలో ఫర్నీచర్‌ను పగుల గొట్టారు. కరపత్రాలను తగులబెట్టారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గుంతకల్లు టిక్కెట్‌ను మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు కేటాయించడంతో అక్కడ జితేందర్‌గౌడ్‌ అనుచరులు కూడా నిరసన వ్యక్తం చేశారు. నెల్లిమర్ల అసెంబ్లీ స్థానం టికెట్‌ ఆశించి భంగపడ్డ కర్రోతు బంగార్రాజు ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కూటమి పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు కేటాయించడంతో భీమిలి సీటు లేదా విజయనగరం పార్లమెంట్‌ సీటు వస్తుందని ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో శుక్రవారం ఆయన తన అనుచరులతో సమావేశమైనారు. నియోజకవర్గంలో పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చీపురుపల్లి అసెంబ్లీ టికెట్‌ ఇవ్వకపోవడంతో టిడిపి విజయనగరం
చీపురుపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కిమిడి నాగార్జున ప్రకటించారు. కళా వెంకటరావుకు టిక్కెట్‌ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆయన అనుచరులు ర్యాలీ నిర్వహించారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ ఆ టిక్కెట్‌ బిజెపికి కేటాయించడం, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరికి కేటాయించడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు తమకే టిక్కెట్‌ దక్కుతుందనే ఆలోచనతో ఉన్న జనసేన నేత పోతిన మహేష్‌, ఆయన అనుయాయులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. మహేష్‌ను పవన్‌కల్యాణ్‌ పిలిచి మాట్లాడినప్పటికీ అనుచరులలో అగ్రహం చల్లారలేదు. అనపర్తిలోనూ ఇదే స్థితి. ఈ నియోజకవర్గాన్ని అనూహ్యంగా బిజెపికి కట్టబకట్టడంతో స్థానిక టిడిపి కార్యకర్తలు రెచ్చిపోయారు. టిడిపి అధినేత స్వయంగా రంగంలోకి దిగినప్పటికీ ఫలితం కనిపించలేదు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేటలో ఇదే పరిస్థితి నెలకొంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎన్నికల బరిలోకి దిగిన పీఠాపురం స్థానంలో కార్యకర్తల్లో ఇంకా అసంతృప్తి రగులుతూనే ఉన్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లా కందుకూరులో అసంతృప్త నేతలు ఎన్నికల బరిలోకి దిగడానికి కసరత్తు చేస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో నెలకొన్న ఈ పరిస్థితులు మూడు పార్టీల్లోనూ ఆందోళన కలిగిస్తోంది.

➡️