ఉరవకొండ సెంటిమెంట్‌ బద్దలు

Jun 4,2024 22:43 #2024 election, #TDP, #Uravakonda, #win
  • రాష్ట్రంలోనూ, నియోజకవర్గంలోనూ ఒకే పార్టీ గెలుపు

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గం గత సెంటిమెంట్‌ను బద్ధలు చేసింది. ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండడం గత 20 ఏళ్లగా ఉంటూ వస్తోంది. అందుకు భిన్నంగా రెండు దశాబ్దాల తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీనే ఇక్కడ విజయం సాధించింది. ఉరవకొండలో వరుసగా రెండవసారి టిడిపి అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ విజయం సాధించారు. 1994లో ఆయన తొలిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు గెలుపొందారు. అదే సమయంలో రాష్ట్రంలో టిడిపి వచ్చింది. ఆ తరువాత నుంచి భిన్నమైన ఫలితాలే వస్తూ వచ్చాయి. 1999లో టిడిపి అధికారంలోకొస్తే పయ్యావుల కేశవ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వై.శివరామిరెడ్డి చేతిలో ఓటమి చెందారు. 2004లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. తిరిగి 2009లో ఆయన గెలుపొందారు. అప్పుడూ కాంగ్రెసు పార్టీనే అధికారంలోకి వచ్చింది. 2014లో టిడిపి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పయ్యావుల కేశవ్‌ వైసిపి అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి చేతిలో ఓటమి చెందారు. 2019లో ఆయన ఉరవకొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడు వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈసారి మాత్రం అటు రాష్ట్రంలోనూ, ఇక్కడ ఈయన గెలుపొందారు. వైసిపి అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డిని 21,704 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ గెలుపు ద్వారా సెంటిమెంట్‌ను రూపుమాపారు.

➡️