ఉత్తరాంధ్ర ‘వన్‌సైడ్‌’

Jun 5,2024 00:09 #2024 election, #TDP, #Uttarandhra
  • ప్రభావం చూపని జగన్‌ నినాదం విశాఖ రాజధాని

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో :  ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసిపి ప్రభావం మచ్చుకైనా కానరాలేదు. ఉత్తరాంధ్ర జిల్లాలైన ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల్లో టిడిపి కూటమి క్లీన్‌ స్వీప్‌ చేసింది. 34 అసెంబ్లీ స్థానాల్లో కేవలం రెండు (పాడేరు, అరకు) స్థానాల్లోనే వైసిపి అభ్యర్థులు గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపి సీటును, విజయనగరం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటు టిడిపి కూటమి కైవసం చేసుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి జిల్లాలో ఏడు, విశాఖ జిల్లాలో ఆరు అసెంబ్లీ సీట్లు టిడిపి కూటమి గెలుచుకోగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు (పాడేరు, అరకు) మాత్రమే వైసిపి గెలుచుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లా)లో మూడు పార్లమెంట్‌ స్థానాలు ఉండగా, అనకాపల్లి ఎంపీ సీటు బిజెపి గెలుచుకోగా, విశాఖ పార్లమెంట్‌ను టిడిపి కైవసం చేసుకుంది. అరకు పార్లమెంట్‌ వైసిపికి దక్కింది. 15 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి 13 కూటమి గెల్చుకుంది. ఇందులో పది స్థానాల్లో టిడిపి, మూడు స్థానాల్లో (పెందుర్తి, యలమంచిలి, విశాఖ దక్షిణం) జనసేన విజయం సాధించాయి.

పనిచేయని జగన్‌ నినాదాలు…
ఈ ఫలితాలతో ఉత్తరాంధ్ర అంతా కూటమికి ‘వన్‌సైడ్‌’ అయిపోయింది. మూడు రాజధానుల నినాదంతో విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చుతానని వైఎస్‌ జగన్‌ ప్రకటించినప్పటికీ జనం ఆహ్వానించలేదన్నది స్పష్టమైంది. సాధారణ ఎన్నికలకు ముందు ఏడాదిన్నర క్రితం జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లోనూ వైసిపి ఘోరంగా ఓటమి చవిచూసింది. వైసిపికి రాష్ట్రంలో కూడా ఇలాంటి రాజకీయ వ్యతిరేక పవనాలు ఉండబోతున్నాయన్న సంకేతాలు ఆ ఎన్నికల్లో ప్రజలు తెలియజేశారు. అభ్యర్థుల మార్పు కొంత ప్రభావం చూపింది. రాష్ట్రంలో సుమారు 80 మంది అభ్యర్థులను జగన్‌ మార్చినట్లే ఎఫెక్ట్‌ తగిలింది. విజయనగరం జిల్లాకు చెందిన బొత్స ఝాన్సీలక్ష్మిని విశాఖపట్నం ఎంపీగా బరిలోకి దించారు. టిడిపి నుంచి ఎం భరత్‌ ఈమెపై 4 లక్షలా 4 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. విశాఖ నగరంలోని వైసిపి నేతలు సీతంరాజు సుధాకర్‌, వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, అక్కరమాని వెంకటరావుకు టికెట్లు ఇవ్వకపోవడంతో టిడిపిలోకి వెళ్లిపోవడంతో విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లపైనా వీరి ప్రభావం కనిపించింది.

ఆ చట్టం ప్రభావం పనిచేసిందా?
ఉత్తరాంధ్రలో ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ప్రభావం కూడా వైసిపిని దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సర్వే పుస్తకాల్లో జగన్‌ ఫొటో కూడా ఉండడంతో కూటమి ఏదైతే ప్రచారం చేసిందో జగన్‌కు 2024లో ఓటేస్తే ‘మీ భూమి, మీ ఇల్లు, మీ స్థలం’ ఏదీ భవిష్యత్‌లో మీవి కాకుండా పోతాయని ఆ నోటా ఈనోటా ఈ ప్రచారం గ్రామీణ ప్రాంతాలకు సైతం తాకింది. దీంతో, ఉత్తరాంధ్రలో 34 సీట్లలో కనీసం 15 నుంచి 20 సీట్లు వస్తాయని భావించిన వైసిపికి ఎదురుదెబ్బ తగిలింది.

➡️