విజయవాడలో ప్రారంభమైన పుస్తకాల పండుగ

Dec 29,2023 09:16 #books
vijayawada book festival

 

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : దేశం విశ్వగురువుగా మారడంలో సాహిత్యానిదే కీలకపాత్ర అని పలువురు వక్తలు అన్నారు. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 34వ విజయవాడ పుస్తక మహోత్సవం గురువారం సాయంత్రం ప్రారంభమైంది. పుస్తక మహోత్సవాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌ మాధవ్‌ కౌశిక్‌ ప్రారంభించి మాట్లాడారు. రాతియుగం నుంచి, రాకెట్‌ యుగం వరకూ మానవుల అభివద్ధియానానికి పుస్తకాలే మెట్లు అని అన్నారు. మనిషి, మనిషిగా ఎదగడంలో పుస్తకాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ యుగంలో మొబైళ్లలో పుస్తకాలు చదవడాన్ని ప్రోత్సహించాలన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మంచి ఆలోచనలు, మంచి స్ఫూర్తి మంచి పుస్తకాలు చదివినప్పుడే కలుగుతాయన్నారు. ఎమెస్కో ప్రచురణల అధినేత విజయకుమార్‌ ప్రారంభోత్సవ సభకు స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తక మహోత్సవ సాహిత్య వేదికపై భారతీయ భాషల కవులందరితో కవి సమ్మేళనం నిర్వహించే అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రముఖ కవి కె.శివారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ మానవాభివద్ధిలో పుస్తకం యొక్క కీలకపాత్ర మారడంలేదన్నారు. ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో అసోసియేట్‌ ఎడిటర్‌ కష్ణారావు మాట్లాడుతూ పుస్తక పఠనాన్ని మహోద్యమంగా ముందుకు తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. పుస్తక మహోత్సవ సంఘం కార్యదర్శి కె లక్ష్మయ్య వందన సమర్పణ చేశారు. గౌరవాధ్యక్షులు బెల్లపు బాబ్జీ, గోళ్ల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మాధవ్‌ కౌశిక్‌ రాసి కృష్ణారావు అనువందించిన ‘రాధికా ఆలకించు’ కవిత్వ పుస్తకాన్ని వేదికపై ఆవిష్కరించారు.

➡️