‘ఉక్కు’ పరిరక్షణకు కట్టుబడ్డవారికే ఎన్నికల్లో మద్దతు – విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

May 10,2024 23:24 #ukkunagaram, #visakha steel

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ కోసం పోరాడుతున్న వారికే ఈ ఎన్నికల్లో కార్మికవర్గం మద్దతు ఉంటుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు యు.రామస్వామి అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 1184వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్‌ బ్లాస్ట్‌ఫర్నేస్‌ విభాగం కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ తమ ఓటు హక్కును మంచికి వినియోగించుకోవడం ద్వారా కార్మిక హక్కులను, స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవచ్చునన్నారు. పోరాటాల ద్వారానే కార్మిక హక్కులు, సౌకర్యాలు లభించాయని, వీటిని నిలబెట్టుకోవడం అందరి కర్తమ్యమని అన్నారు. రాజకీయ పార్టీల నేతలు ప్రలోభాలకు గురిచేసి ఓట్లును కొల్లగొట్టే పనిచేస్తున్నారని, అటువంటి చర్యలను తిప్పికొట్టి ప్లాంట్‌ పరిరక్షణ కోసం పోరాడుతున్న వారికే ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో పోరాట కమిటీ ఛైర్మన్‌ డి.ఆదినారాయణ, నాయకులు ఎన్‌.రామారావు, జె.రామకృష్ణ, ఆర్‌.వెంకటరావు, సన్నిబాబు, దాసరి శ్రీను పాల్గొన్నారు.

➡️