ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పాలన

Mar 5,2024 21:53 #ap cm jagan

-మళ్లీ గెలుస్తా… ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా…

-రూ.లక్షా 5 వేల కోట్లతో ‘విశాఖ విజన్‌’

– రాబోయే పదేళ్లలో ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతా

-తూర్పు తీరంలో ‘మెగాసిటీ’ కోసం ప్రణాళిక

-అమరావతితో పోలిస్తే వైజాగ్‌కే రాజధానిగా సహజమైన భౌగోళిక వెసులుబాటు : ముఖ్యమంత్రి జగన్‌

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో :’వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తా. విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తా. ఎన్నికల తర్వాతే రాష్ట్ర రాజధానిగా విశాఖ ఉంటుంది. ఇక్కడ నుంచే పాలన సాగిస్తా’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం విశాఖలోని రుషికొండ బీచ్‌లోగల రాడిసన్‌ బ్లూ హోటల్‌లో పలు రంగాల పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘విజన్‌ విశాఖ’ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తూ రాబోయే పదేళ్లలో లక్షా 5 వేల కోట్ల పెట్టుబడులకు వేదికగా విశాఖను అభివృద్ధి చేసి ప్రపంచంలోని అత్యుత్తమ ప్రగతి కేంద్రాలతో చేయిచేయి కలిపి తూర్పు తీరంలో ‘మెగా సిటీ’గా తీర్చిదిద్దుతానని అన్నారు. అగ్రగామి పారిశ్రామికవేత్తలంతా వైజాగ్‌ను ఫిన్‌-టెక్‌ క్యాపిటల్‌గా చూస్తున్నారని, అమరావతితో పోలిస్తే వైజాగ్‌ను రాజధానిగా చేయడానికి సహజమైన భౌగోళిక వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ – వైజాగ్‌ – విజయవాడ – బెంగళూరు మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్ల కోసం సంప్రదిస్తున్నామని తెలిపారు. వీటన్నింటితో పాటు విశాఖకు ముఖ్యమంత్రి వస్తే రాగల పదేళ్లలో వైజాగ్‌ దేశంలోని అత్యుత్తమ నగరాలతో పోటీపడే అవకాశం ఉంటుందన్నారు.

ఉత్పత్తి రంగంలో దేశంలో మెరుగ్గా రాష్ట్రం

ఉత్పత్తి రంగంలో దేశంలో మన రాష్ట్రం మెరుగ్గా ఉందని, అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకుపోతోందని జగన్‌ అన్నారు. విశాఖను ‘ఎకనమిక్‌ గ్రోత్‌ ఇంజన్‌’లా మార్చే బాధ్యత తమ ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని, ఆనాటికే లక్ష కోట్లంటే 10 నుంచి 15 సంవత్సరాల్లో అది రూ.10 లక్షల కోట్లు అవుతుందని అన్నారు. విశాఖలో ఆ అవసరం రాదని, అన్ని హంగులూ ఇక్కడున్నాయని వివరించారు. దేశాన్ని ఆకర్షించే ‘ఐకానిక్‌ సెక్రటేరియట్‌’ విశాఖలో నిర్మిస్తామన్నారు. రామాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు భవిష్యత్‌ ప్రగతిలో ఎంతో కీలకంగా మారనున్నాయని పేర్కొన్నారు. పదేళ్లలో పెట్టుబడుల రాకతోపాటు కారిడార్‌ల అభివృద్ధి, మెట్రో లైన్‌ ఏర్పాటు, భోగాపురం ఎయిర్‌పోర్టు, ఇవన్నీ రావడం ద్వారా హైదరాబాద్‌, చెన్నరు, బెంగళూరుతో పోటీగా విశాఖ ఎదుగుతుందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని, గత నాలుగేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని పేర్కొన్నారు. విభజన తర్వాత రాష్ట్రం చాలా కోల్పోయిందన్నారు. దేశంలో రెండో అతి పెద్ద సముద్రతీరం రాష్ట్రం సొంతమని, దీనివల్ల తయారీ రంగానికి మంచి అవకాశం ఉందని పేర్కొన్నారు. 974 కిలోమీటర్ల తీరం గుండా పారిశ్రామికవాడలను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే డాక్యుమెంట్‌ ‘విశాఖ విజన్‌’ అని వివరించారు. 2019కు ముందు కేవలం నాలుగు చోట్ల నుంచే ఎగుమతులు జరిగేవని, తమ ప్రభుత్వ అధికారంలోకొచ్చాక రూ.16 వేల కోట్ల పెట్టుబడులతో నాలుగు కొత్త పోర్టుల నిర్మాణం, పది ఫిషింగ్‌ హార్బర్‌ల నిర్మాణంతో అగ్రగామిగా రాష్ట్రం మారిందన్నారు. గతేడాది విశాఖలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌లో రూ.13 లక్షల కోట్లకుపైగా 352 ఎంఒయులు జరగ్గా ఆరు లక్షల మందికి ఉపాధి లభించిందని పేర్కొన్నారు. 39 శాతం ఒప్పందాలు ప్లాంట్ల ఏర్పాటు ద్వారా కార్యరూపంలోకి వచ్చాయన్నారు. వ్యవసాయంలో ఎపి 70 శాతం ప్రగతి సాధించామని, నిరుద్యోగం తగ్గిందని వివరించారు. హై స్పీడ్‌ రైళ్ల కోసం ప్రధానితో మాట్లాడుతున్నానన్నారు. హోటళ్ల రంగంలో ఓబరారు, మై ఫెయిర్‌ పెట్టుబడులతో బెస్ట్‌ 5 స్టార్‌ సదుపాయాలు, ఎన్‌టిపిసి గ్రీన్‌ హైడ్రోజన్‌ రూపంలో రూ.30 వేల కోట్లతో పెట్టుబడులు విశాఖకు రాబోతున్నాయని తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని, వైజాగ్‌కు పాలన మారుతుందంటే ఇక్కడ భూములు కబ్జా చేయడానికి వస్తున్నారనే తప్పుడు వార్తా కథనాలను, ప్రతిపక్షానికి లబ్ధి కలిగించే రాతలను రాస్తున్నాయని విమర్శించారు. విశాఖ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే అమరావతిలో బినామీ పేర్లతో కొన్న వారి భూముల రేట్లు పడిపోతాయని భీతిల్లిపోతున్నారని టిడిపి వారినుద్దేశించి జగన్‌ అన్నారు. అనంతరం నగరంలోని పిఎం.పాలెంలో ఎపి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ఆధ్వర్యాన జరిగిన ‘భవిత’ కార్యక్రమాన్ని సిఎం ప్రారంభించారు. పారిశ్రామిక నైపుణ్యాలను అందిపుచ్చుకునే శ్రామికశక్తిని అభివృద్ధి చేయాలన్నారు. రూ.1,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బత్స సత్యనారాయణ, అమర్‌నాథ్‌, విడదల రజని తదితరులు పాల్గొన్నారు.

➡️