సాగర్‌ కుడి కాలువకు నీటి విడుదల

ప్రజాశక్తి- విజయపురిసౌత్‌ (పల్నాడు జిల్లా) : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడి కాలువకు సోమవారం అధికారులు తాగునీటిని విడుదల చేశారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఇఇ శివశంకరయ్య పర్యవేక్షణలో కుడికాలువ 5, 7 గేట్ల ద్వారా 5,500 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఇఇ శ్రీహరి విడిచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాగునీటి అవసరాల నిమిత్తం ఐదు టిఎంసిల నీటిని రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున పది రోజుల పాటు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ నీటిని తాగునీటికి మాత్రమే ఉపయోగించాలని, రైతులు సాగునీటికి వాడుకోవద్దని కోరారు. కుడి కాలువ పరిధిలోని చెరువులను, కుంటలను నింపుకొని తాగునీటి నిమిత్తం వాడుకోవాలని సూచించారు. వేసవి నేపథ్యంలో తాగునీటిని పొదుపుగా వినియోగించు కోవాలని, మంచినీటి చెరువులను నింపుకోవడానికి, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలకు తాగునీటిని విడుదల చేశామన్నారు. ఇప్పటికే వేసవి ఎండలకు చెరువులన్నీ ఎండిపోయాయని, వాటిని నింపుకొని తాగునీటి అవసరాలకు వాడుకోవాలని ఆయన సూచించారు. కుడి కాలువ పరిధిలో పల్నాడు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలూ, గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గాలు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మెట్ట ప్రాంతంలోని మండలాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో డిఇ మురళీధర్‌, జెఇ బాబుమియా, సిబ్బంది పాల్గొన్నారు.

➡️