జూన్‌ ఆఖరు వరకు ట్యాంకర్ల ద్వారా నీరు

May 3,2024 22:11 #ap cs, #cs jwahar reddy, #drink water
  •  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. తాగునీరు, ఉపాధి హామీ పనులపై శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాగునీటి ఎద్దడిని తగ్గించేందుకు జూన్‌ ఆఖరు వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేయాలన్నారు. భూగర్భ జలమట్టాలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని ఆదేశించారు. జల్‌జీవన్‌ మిషన్‌కు సంబంధించిన పనులను ఈ నెల 13న ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆమోదంతో చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తాగునీటికి ఇబ్బంది గల 281 ఆవాసాలకు ప్రస్తుతం ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. మొత్తం 3,075 ఆవాసాలకు జూన్‌ ఆఖరు వరకు ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. కరువు మండలాల్లో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుకు రూ.39 కోట్లకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందన్నారు. తాగునీటి అవసరాల నిమిత్తం సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను నింపేందుకు ప్రకాశం బ్యారేజి, నాగార్జున సాగర్‌ కుడి ప్రధాన కాలువల ద్వారా ఈ నెల ఒకటి వరకు నీటిని విడుదల చేశామని చెప్పారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇఎన్‌సి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️