జగన్‌ వెంటే మేము : పెద్దిరెడ్డి

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజమని, తమ నేత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని, వచ్చే ఎన్నికలో ఆయన్ను సిఎం చేయడమే లక్ష్యంగా పని చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని నాగయ్య కళాక్షేత్రంలో గురువారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గని మాట్లాడారు. జగన్‌ సోదరి షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరినా వైఎస్‌ఆర్‌సిపి నుంచి వెళ్ళేవారు లేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, టిడిపి పార్టీలు ఎన్ని వచ్చినా తాము ముఖ్యమంత్రి వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా గాంధీ, చంద్రబాబుదని విమర్శించారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు పార్టీపై చేసిన వ్యాఖలపై స్పందిస్తూ జడ్‌పిటిసిగా ఓడిపోయిన ఎంఎస్‌ బాబుకు పూతలపట్టు టికెట్‌ ఇచ్చి గెలిపించేందుకు ఎంతో కృషిచేశామని, అలాంటిది ఆయన పార్టీకి విశ్వాసంగా ఉండాల్సింది పోయి అనుచితంగా మాట్లాడడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా పార్టీపై విశ్వాసం చూపితే ఆదరిస్తామని తెలిపారు. ఆయన వెంట ఎంపి రెడ్డప్ప, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు.

➡️