మార్పు తెచ్చాం… గత ప్రభుత్వాలు చేయనివి ఎన్నో చేశాం: సిఎం జగన్‌

Dec 30,2023 08:53 #ap cm jagan, #speech

-బాబు, పవన్‌లవి మోసపూరిత మాటలు

-భీమవరంలో విద్యాదీవెన సభలో సిఎం జగన్‌

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి :విద్యతో పాటు అనేక రంగాల్లో గత నాలుగన్నరేళ్ల కాలంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఆయన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో శుక్రవారం ఆయన బటన్‌ నొక్కి విద్యా దీవెన డబ్బులు విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ విద్య వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, పరిపాలన ఇలా అనేక రంగాల్లో గణనీయ మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ మార్పులను బట్టే గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గుర్తించి, ఆలోచించాలన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడిమీద, జపసేన అధినేత పవన్‌ కల్యాణ్‌మీద ఆయన విరుచుకుపడ్డారు. పవన్‌ వివాహాల అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. ఆయన జి కోసం త్యాగాలు చేస్తారని విమర్శించారు. మూడు నెలలకోసారి తల్లుల ఖాతాలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్మును తమ ప్రభుత్వం జమ చేస్తోందన్నారు. మొత్తం 8,09,039 మంది పిల్లలకు బటన్‌ నొక్కి మొత్తం రూ.583 కోట్లను తాజా కార్యాక్రమంలో జమ చేసినట్లు తెలిపారు. నాలుగున్నరేళ్లలో విద్యా దీవెన పథకం కింద 27.61 లక్షల మంది పిల్లలకు రూ.11,900 కోట్లు పూర్తి స్థాయిలో ఫీజు జమ చేశామన్నారు. వసతి దీవెన కింద ఇప్పటి వరకు రూ.4,275 కోట్లు ఇచ్చామని తెలిపారు. నాడు-నేడు కింద బడులు బాగుపడిన తీరు గమనించాలని కోరారు. మూడో తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్లతో బోధన చేయిస్తున్నామన్నారు. విదేశీ విద్యా దీవెన కింద కోటీ 20 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో విద్యారంగానికి రూ.73 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. అమ్మ ఒడి, పొదుపు సంఘాలకు చేయూత, 31 లక్షల ఇంటి స్థలాలు, 22 లక్షల ఇళ్లు, డిబిటి కింద రూ.2.45 లక్షల కోట్లు జమ, 50 ఇళ్లకు వలంటరీ వ్యవస్థ, ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, అసైన్డ్‌ భూములకు శాశ్వత హక్కులు, రైతు భరోసా, మూడు రెట్ల పెన్షన్‌, శాశ్వత బిసి కమిషన్‌, 17 మెడికల్‌ కాలేజీలు, పది ఫిష్షింగ్‌ హార్బర్‌లు వంటి అనేక కార్యక్రమాలు తమ ప్రభుత్వంలో అమలు చేశామని వివరించారు. ఇంతకంటే మంచి పథకాలు చంద్రబాబు ప్రవేశపెట్టారా అని ప్రశ్నించారు. చంద్రబాబు 14 ఏళ్లపాటు మూడుసార్లు సిఎంగా చేశారని, ఏనాడైనా గుర్తు పెట్టుకోదగిన మంచి చేశాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకి, దత్తపుత్రుడికి ఒంటరిగా పోటీచేసే సత్తాలేదన్నారు. . ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

➡️