2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’ : మోడీ

Mar 5,2024 10:07 #PM Modi, #Telangana, #tour
  • ఆదిలాబాద్‌ విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : వికసిత్‌ భారత్‌ కోసం బిజెపి కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ పోయి కాంగ్రెస్‌ వచ్చినా పాలనలో ఎలాంటి మార్పూ లేదని విమర్శించారు. బిజెపి ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో సోమవారం నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’లో ఆయన మాట్లాడారు. కుంగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ‘అప్పుడు మీరు తిన్నారు… ఇప్పుడు మేం తింటాం’ అన్నట్లు కాంగ్రెస్‌ పరిస్థితి ఉందని విమర్శించారు. రాష్ట్రంలో సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపించామని, అభివృద్ధి పథకాలకు ఇతోధికంగా సహకారం అందించామని అన్నారు. దేశంలో ఏడు మెగా టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని, అందులో ఒకటి తెలంగాణలో పెడతామని తెలిపారు. 15 రోజుల్లో ఐదు ఎయిమ్స్‌లను ప్రారంభించామన్నారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేశామని చెప్పారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి 400 సీట్లు గెలవాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని, పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి బిజెపి కృషి చేస్తోందని తెలిపారు. గత పదేళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారని చెప్పారు. అంతకుముందు రూ.7 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. రామగుండం ఎన్‌టిపిసిలో 800 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. దీంతోపాటు రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించారు. కేంద్రంతో కలిసి ముందుకు : సిఎం రేవంత్‌ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకెళ్తామని తెలిపారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్నారు. ఎన్‌టిపిసికి తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సహకరిస్తుందని వివరించారు. కంటోన్మెంట్‌ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు ప్రధానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి పెద్దన్నలా మోడీ సహకారం అందించాలని కోరారు. గవర్నర్‌ తమిళసై, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గన్నారు.

➡️