రైతురాజ్యం తీసుకొస్తాం : టిడిపి అధినేత చంద్రబాబు

ప్రజాశక్తి – బాపట్ల జిల్లా : వైసిపి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. రైతుల సమస్యలు తీరుస్తామని, రైతు రాజ్యం రావడానికి టిడిపి, జనసేన కలిసి పనిచేస్తాయని, అరాచక శక్తులు రాజ్యమేలుతున్నప్పుడు రాష్ట్ర ప్రజలు ఒకటి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. బాపట్ల జిల్లాలో బాపట్ల, పర్చూరులో తుపానుకు దెబ్బతిన్న పంటలను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పర్చూరు మండలం చెరుకూరులో నిర్వహించిన సభలో రైతులు, ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. వాగులు, కాలువల్లో పూడికలు తీసేయించినట్లయితే రైతులు ఇంతగా నష్టపోయే వారు కాదన్నారు. ప్రస్తుత రైతుల దుస్థితికి సిఎం జగన్‌ బాధ్యత వహించాలన్నారు. గాల్లో తిరిగి రైతుల సమస్యను ముఖ్యమంత్రి గాలికి వదిలేసి వెళ్లిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో రహదారులు బాగాలేవు కాబట్టే ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో తిరుగుతున్నా రని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల గేట్లకు మరమ్మతులు చేయలేని ముఖ్య మంత్రి రాజధాని కడతారా.? అని ప్రశ్నించారు. ఈనాడు, ఈటివి, ఆంధ్రజ్యోతి, ఎబిఎన్‌లు చూడొద్దని, ఒక్క సాక్షి మాత్రమే చూడండి అని ప్రజలకు సిఎం చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రజల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు. తుపాన్‌ ప్రభావంతో నష్టపోయిన చెరుకూరుకు చెందిన మిర్చి రైతు గడ్డం శ్రీనివాసరావుకు రూ. రెండు లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.

➡️