మోడీని గద్దె దించితేనే భారత్‌ వికాసం

May 10,2024 07:48 #echuri
  • పదేళ్ల బిజెపి పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు పతనం
  • ప్రత్యామ్నాయం కోసం ఇండియా బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించాలి : గన్నవరం సభలో సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి

ప్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి : మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో దిగజారిందని, బిజెపిని గద్దె దించేతేనే భారత్‌ ప్రజల వికాసం జరుగుతుందని సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి అన్నారు. ఇండియా బ్లాక్‌ బలపర్చిన సిపిఎం గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కళ్ళం వెంకటేశ్వరరావు, బందరు పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గొల్లు కృష్ణ విజయాన్ని కాంక్షిస్తూ …  కృష్ణాజిల్లా గన్నవరం మండలం దావాజీగూడెం పామర్తి నగర్లోని ఎస్‌విఆర్‌ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన సభలో సీతారామ్‌ ఏచూరి మాట్లాడుతూ … మోడీ పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, ధరలు తగ్గిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. మోడీ పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా చదువుకున్న గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం 42 శాతానికి పెరిగిందన్నారు. దేశంలో ప్రజలకు ఎంతో ఉపాధి కల్పిస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకానికి ప్రభుత్వం నిధుల కోతపెట్టిందన్నారు. ఈ పరిస్థితుల్లో సామాన్యుల ఆదాయాలు పడిపోయాయన్నారు. కుటుంబాల పొదుపు సామర్థ్యం తగ్గిపోయిందని, జిడిపిలో 72 శాతం అప్పులు పెరిగాయన్నారు. దేశంలో కొద్దిమంది కుబేరుల ఆస్తి మాత్రం భారీగా పెరిగిందన్నారు. దీనంతటిని బిజెపి భారత్‌ వికాసం అని ప్రచారం చేసుకుంటుందన్నారు. మోడీ పాలనలో కుబేరుల వికాసం మాత్రమే జరిగిందన్నారు. ప్రజల వికాసం జరగాలంటే మోడీని గద్దెదించాలన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలను ముందుకు తీసుకొస్తున్న ఇండియా బ్లాక్‌ను దేశంలోనూ, రాష్ట్రంలోనూ  గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు జరిగిన మూడు దశల ఎన్నికలు పరిశీలిస్తే మోడీకి ఎదురుగాలులు వీస్తున్నాయని స్పష్టం అవుతోందని సీతారామ్‌ ఏచూరి అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల మధ్యన చిచ్చుపెట్టే మతోన్మాద అజెండాని ఎన్నికల్లో బిజెపి అనుసరిస్తోందన్నారు. ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని గద్దె దించటం కోసం గతంలో ఎన్నడూలేని విధంగా దేశవ్యాప్తంగా 26 పార్టీలతో ఇండియా బ్లాక్‌ ని ఏర్పాటు చేశామన్నారు. దేశాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టిస్తూ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బిజెపిని ఇంకా పాలనలో ఉంచకూడదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేంద్రంలోని బిజెపి పాలకులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తీరని ద్రోహం చేస్తూనే ఉన్నారన్నారు. అన్ని మతాల ప్రజలూ కలిసి మెలిసి అన్నదమ్ముల్లా మెలుగుతూ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంలా ఉంటున్నారనీ… కానీ మైనార్టీల పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టి వివక్షతను కూడా బిజెపి ప్రదర్శిస్తోందన్నారు. వైసిపి, టిడిపి, జనసేనలు రాజ్యాంగ లౌకిక విలువలను కాపాడేందుకు ప్రయత్నించకపోగా బిజెపికి కొమ్ము కాస్తుండటం దుర్మార్గ పూరితమన్నారు. దేశంలో బిజెపిని ఓడించాలని, రాజ్యాంగాన్ని, ప్రజలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని రద్దుచేసే బిజెపితో భాగస్వామ్య పార్టీలైన టిడిపి, జనసేనలకు మద్దతు ఇస్తున్న వైసిపిని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఎలాంటి నిధులు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. కేంద్రప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయించినా భవనాలు నిర్మించలేదన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా చేయటంలో బిజెపి పాత్ర ఉందని గుర్తుచేశారు. పోలవరానికి, కడప ఉక్కుకు నిధులను నిరాకరించిందన్నారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రా ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీని ఎగ్గొట్టిందని ధ్వజమెత్తారు. రైల్వే జోన్‌ విషయంలో మోసం చేసిందన్నారు. ఇవన్నీ చాలవన్నట్లుగా మన విశాఖ ఉక్కును తెగనమ్మటానికి బిజెపి సిద్ధమైందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందంటూ … ఐదేళ్ల క్రితం విమర్శించిన చంద్రబాబు, పవన్‌ లు ఇప్పుడు అదే బిజెపితో జత కట్టి ఏకంగా ఎన్‌డిఎ కూటమిలో చేరారని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వారితో చేతులు కలిపి రాష్ట్ర్ర అభివృద్ధి ఎలా సాధిస్తారో చంద్రబాబు, పవన్‌ చెప్పగలరా ? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి, టిడిపి, జనసేన కూడా లబ్ధిపొందాయని వివరించారు. బిజెపి పాలనలో అమృత కాలం నడుస్తుందని మోడీ చెబుతున్నారనీ, కానీ విషపూరిత కాలం నడుస్తుందని విమర్శించారు. కార్పొరేట్లతో కుమ్మక్కై అదానీ, అంబానీ వంటి బడా కార్పొరేట్లకు ప్రజల సంపదనంతా దోచిపెడుతూ, మరో పక్క ప్రజలపై భారాలను మోపుతూ మోడీ ప్రభుత్వం ప్రజల నడ్డివిరుస్తోందన్నారు. మోడీ ప్రభుత్వం ఎన్నికల బాండ్ల బండారంతో కార్పొరేట్‌ బిజెపి అవినీతి బట్టబయలైందన్నారు. దేశంలో ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధిక లబ్ధి పొందింది బిజెపియేనని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఇండియా బ్లాక్ అభ్యర్థులను గెలిపించాలని ఏచూరి పిలుపునిచ్చారు.

మోడీ, జగన్‌ పాలన పోవాలి : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
కేంద్రంలో మోడీ నాయకత్వంలోని మతోన్మాద బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసిపి నేతృత్వంలోని వైఎస్‌ జగన్‌ పాలన పోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికలు ఎంతో కీలకమైనవన్నారు. దేశ, రాష్ట్ర భవిష్యత్తు వీటిపై ఆధారపడి ఉందన్నారు. దేశం, రాష్ట్రంలో ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, జనసేన, వైసిపి నాయకులు ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే విషయంపైనే చర్చించుకుంటున్నారన్నారు. ఈ ఐదేళ్లలో జగన్‌ నియంతలా పరిపాలన సాగించారని, ఇంతవరకు ప్రజా సమస్యలపై ఒక్క వినతిపత్రాన్ని కూడా స్వీకరించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేశామని జగన్‌ చెబుతున్నారు కానీ కీలక పోస్టులన్నింటినీ ఒకే సామాజిక తరగతితో నింపేశారని విమర్శించారు. రాష్ట్రంలో కోటరీగా ఏర్పడి ముఠా, అరాచక పాలన సాగించారనీ… పోలీసు రాజ్యాన్ని నడిపించారన్నారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన సిఎం మద్యం అమ్మకాల కోసం రూ.48 వేల కోట్లు కార్పొరేషన్‌ ద్వారా అప్పుగా తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో అప్పులు రూ.13 లక్షల కోట్లకు చేరాయనీ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు గతంలో ఎన్‌డిఎ, మోడీతో కలిసి నాలుగేళ్లు ప్రయాణం చేశారన్నారు. రాష్ట్రానికి ఏమీ సాధించి తీసుకురాలేకపోయారని… రాష్ట్రానికి ఏమీ ఇవ్వని బిజెపితో మళ్లీ కలిసి ప్రయాణించటం సిగ్గుచేటన్నారు. దేశవ్యాప్తంగానూ, రాష్ట్రంలోనూ ప్రజలు ప్రత్యామ్నాయంగా ఉన్న ఇండియా బ్లాక్‌ను ఆదరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇండియా బ్లాక్‌ బలపర్చిన అభ్యర్థులకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని రామకృష్ణ కోరారు.

మోడీ, జగన్‌ పాలనలో తీవ్ర నిర్బంధం : ఎపి పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ
దేశంలో మోడీ, రాష్ట్రంలో జగన్‌ పాలనలో దేశం, రాష్ట్రం తీవ్రంగా నష్టపోయాయని ఎపి పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ విమర్శించారు. గన్నవరంలో సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి వై.నరసింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గృహ నిర్బంధాలు, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ … కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసే వారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, విభజన హామీలు అమలు చేయకపోయినా జగన్‌, చంద్రబాబు, పవన్‌ అందరూ మోడీతో కలిసి వెళుతున్నారన్నారు. అధికారంలో ఉండగా దోచుకుని, దాచుకుని మోడీతో అధికారం కోసం అంటకాగుతున్నారని మండిపడ్డారు. దేశంలో, రాష్ట్రంలో మహిళలపై నానాటికీ దాడులు పెరిగిపోతుండటం దారుణమన్నారు. జగన్‌ దిశ చట్టం పెట్టినా కూడా బాలికలు, మహిళలు, ఆఖరికి వృద్ధులపై కూడా దాడులు జరుగుతుండటం బాధాకరమన్నారు. ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం పూర్తికావాలన్నా, స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ ఆగాలన్నా, విజభన హీమీల అమలుకు ఇండియా బ్లాక్‌ను గెలిపించాలని సుంకర పద్మశ్రీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు వై.నరసింహారావు, టి. తాతయ్య, సిపిఎం రాష్ట్ర నాయకురాలు కాట్రగడ్డ స్వరూపరాణి, సిపిఐ గన్నవరం సమితి కార్యదర్శి వాసుదేవరావు, తదితరులు పాల్గొన్నారు.

 

➡️