సమస్యల పట్ల మీ వైఖరేమిటి ? : టిడిపికి వి.శ్రీనివాసరావు ప్రశ్న

  • బిజెపికి వ్యతిరేకంగా చొరవ తీసుకోవాలని సూచన

ప్రజాశక్తి – ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా) : రాష్ట్రాన్ని వెంటాడుతున్న వివిధ సమస్యలపై తెలుగుదేశం పార్టీ తన వైఖరిని వెల్లడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. అల్లూరి జిల్లా ఎటపాక మండలం కెఎన్‌.పురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేసిన తీరు, ఫలితంగా సమస్యల వలయంలో రాష్ట్రం కూరుకుపోయిన అంశాన్ని ప్రస్తావించారు కనీస వేతనాల కోసం అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, ఎస్‌ఎస్‌ఎ టీచర్లు, వాలంటీర్లు ఆందోళన బాట పట్టారని అన్నారు. పోలవరం నిర్వాసితులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పారు. ‘ ఈ సమస్యలన్నింటిపైనా మీ వైఖరేమిటి?’ అని ప్రశ్నించారు. బిజెపి అమలు చేసిన వినాశకర విధానాలకు వంత పాడుతూ వైసిపి, టిడిపిలు ఇప్పటివరకు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం బిజేపి యేతర పార్టీలన్నీ ఏకం కావాల్సిన సమయమని, ఆ అవసరం ఎంతో ఉందని చెప్పారు. దీనికి టిడిపి చొరవ తీసుకోవాలని సూచించారు. బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ తమ పార్టీ ఉనికిలో లేకుండా పోతుందోనన్న భయంతో టిడిపి, వైసిపిలు ఇప్పటి వరకు మోడీకి ఊడిగం చేశారని వ్యాఖ్యానించారు. జనసేన ఏకంగా ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉందని, ఇది దారుణమని అన్నారు. ఇప్పటికైనా టిడిపి వైఖరిలో మార్పురాకపోతే ఆ పార్టీ రాష్ట్రంలో మనుగడ లేకుండా పోతుందని అన్నారు. వరదలు, తుపానుల వల్ల పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వారికి నష్టపరిహారాన్ని ఇంతవరకు చెల్లించలేదని చెప్పారు. అంగన్‌వాడీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేయకపోవడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు సమ్మెకు దిగారని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమస్యలను పట్టించుకోకుండా అధికార, ప్రతిపక్ష పార్టీలు బూటకపు సర్వేలపై ఆధారపడి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అంచనాలు వేసుకుంటున్నాయని విమర్శించారు. ఓట్లు వేసే ప్రజలను ఇలా గాలికొదిలేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, పార్టీ ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌, జిల్లా నాయకులు మర్లపాటి నాగేశ్వరరావు, లోతా రామారావు పాల్గొన్నారు.

➡️