బాబాయ్ హత్యపై జగన్‌ మౌనం ఎందుకు?

– ముస్లిములకు కాంగ్రెస్‌ అండ
రెండో రోజు బస్సుయాత్రలో వైఎస్‌.షర్మిల
ప్రజాశక్తి – కడప :వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్‌రెడ్డిని సిబిఐ నిందితుడిగా తేల్చిందని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల అన్నారు. బాబారు హత్య విషయంలో జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. హత్యా రాజకీయాలు ప్రోత్సహించే వారికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. తన పుట్టుక మీద సోషల్‌ మీడియాతో దుష్ప్రచారం చేస్తున్న సిఎం జగన్‌ పట్టించుకోలేదని విమర్శించారు. తన తల్లిని కూడా అవమానిస్తున్నారని చెప్పారు. వైఎస్‌ఆర్‌ జిల్లా కడప నియోజవకర్గంలో రెండో రోజు బస్సుయాత్ర కొనసాగింది. తొలుత పెద్దదర్గా, దేవునికడప, సిఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యాత్ర సందర్భంగా పలుచోట్ల ఆమె మాట్లాడుతూ..ముస్లిములను, ప్రజలను ఆదరించి వారికి అండగా నిలిచే పార్టీ కాంగ్రెస్‌ అని చెప్పారు. మాజీ సిఎం రాజశేఖర్‌రెడ్డి ముస్లిములను ఎంతగానో ప్రేమించే వారని, వారికి నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించి అన్ని విధాలుగా సహాయం చేశారని తెలిపారు. ముస్లిములకు అన్యాయం చేసిన బిజెపితో వైసిపి, టిడిపిలు రహస్య ఒప్పందం చేసుకొని బానిసలుగా మారి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయని ఆరోపించారు. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి బతికి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదన్నారు. కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ ఎప్పుడో వచ్చేదని, టిడిపి, వైసిపి పాలనలో శంకుస్థాపనలకే ఈ ఫ్యాక్టరీ పరిమితమైపోయిందని వివరించారు. ఎంపిగా జిల్లా ప్రజలకు, జిల్లాకు వైఎస్‌.అవినాష్‌రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. కార్యక్రమంలో పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డి, డిసిసి అధ్యక్షులు శ్రీరాములు, డిసిసి మాజీ అధ్యక్షులు నజీర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన పూతలపట్టు ఎమ్మెల్యే
చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసిపి ఎమ్మెల్యే ఎం.ఎస్‌.బాబు కాంగ్రెస్‌లో చేరారు. పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కండువా కప్పి ఆయనను షర్మిల పార్టీలోకి ఆహ్వానించారు. వైసిపి తరుపున డాక్టర్‌ సునీల్‌కు సీటు కేటాయించడంతో ఆయన పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కార్యకర్తలతో చర్చించి, వారి అభిప్రాయం తీసుకుని కాంగ్రెసులో చేరినట్లు సమాచారం. ఈ నియోజకవర్గం నుంచి ఒకసారి గెలిచిన వారు మరోసారి గెలిచే అవకాశం లేకపోవడంతో బాబుకు కాకుండా వైసిపి మరో అభ్యర్థికి సీటు కేటాయించింది.

➡️