మా ప్రచార వాహనాలను ఆపుతారా?

-ఎన్నికల అధికారిపై మంత్రి సీదిరి ఆగ్రహం
ప్రజాశక్తి- పలాస (శ్రీకాకుళం జిల్లా) :తమ ప్రచార వాహనాలను ఎందుకు ఆపారంటూ ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి ఆశాలతతో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి, పలాస వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో శనివారం సామాజిక మాద్యమాల్లో హల్‌చల్‌ చేసింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో శుక్రవారం రాత్రి మంత్రి తన ఎన్నికల ప్రచారం నిర్వహించి పలాస బయలుదేరారు. పలాసలోని కోసంగిపురం జాతీయ రహదారి వద్ద ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది ప్రచార వాహనాలను ఆపి తనిఖీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అక్కడకు చేరుకుని, ఎందుకు వాహనాలను ఆపారని ప్రశ్నించారు. ప్రచార రథాలపై ఒక జెండా పెద్దదిగా ఉందని, ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, అందుకే ఆపామని మంత్రికి ఆమె బదులిచ్చారు. దీంతో, ‘ఏంటీ తమాషా చేస్తున్నారా? రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రచార రథాలు ఇలానే ఉన్నాయి. పలాసలోనే సమస్య వచ్చిందా? ప్రచార రథం, రూ.లక్ష ఇస్తాను. మీ ఇష్టమొచ్చినట్లు తయారు చేయించి వాహనాన్ని ఇవ్వండి’ అంటూ ఆమెపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఆపారని, మరోసారి ఇలా చేస్తే బాగోదని హెచ్చరించారు. ప్రచార రథం ఇలాగే ఉంటుందని, ఎవరికి ఫిర్యాదు చేస్తారో చేసుకోండి అంటూ సమాధానం ఇచ్చారు. నిబంధనలు చెప్తుంటే గొడవ పెట్టుకుంటారేంటని మంత్రిని ఆమె ప్రశ్నించారు. తన విధులకు మంత్రి అప్పలరాజు ఆటంకం కలిగించారంటూ పలాస ఎన్నికల అధికారులకు ఆశాలత ఫిర్యాదు చేశారు.

➡️