చట్టాల్లో మార్పులతో..భూ హక్కు కోల్పోయే ప్రమాదం

Feb 29,2024 11:02 #CPM AP, #land issuses
With changes in laws..the risk of losing land rights

భూమి సాధించేవరకూ పోరాడాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాధం

ప్రజాశక్తి-మెంటాడ (విజయనగరం జిల్లా) : ఇటీవల కాలంలో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్‌ ప్రభుత్వం భూ చట్టాలలో తీసుకొచ్చిన మార్పుల వల్ల భూమిపై హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం అన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యాన బుధవారం ‘భూ చట్టాలు..పేదలు.. సిపిఎం వైఖరిపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా గిరిజన, దళితుల పేదల బతుకుల్లో మార్పు రావడం లేదన్నారు. దీనికి ఇప్పటివరకు పాలించిన పాలకులే కారణమన్నారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూములను ఆదాని, అంబానీలకు కట్టబెట్టేందుకు వీలుగా చట్టాలు తెచ్చారని, భవిష్యత్తులో పోడు భూమి నుంచి గిరిజనులను దూరం చేస్తారని తెలిపారు. 1/70 చట్టం ప్రకారం డి- పట్టా భూములు పేదలకు దక్కే అవకాశం ఉన్నా రెగ్యులరైజేషన్‌ పేరుతో భూమిని భూస్వాములు పెత్తందారుల చేతుల్లో పెట్టడానికి జగన్‌ ప్రభుత్వం చూస్తున్నదని అన్నారు. అన్నింటికీ గ్యారెంటీ ఉందని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్‌ పేదల భవిష్యత్తుకు మాత్రం గ్యారెంటీ ఇవ్వడం లేదన్నారు. కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిల్‌ చట్టం వల్ల మనభూమికి మనమే ఆధారాలు తెచ్చుకోవాలని, లేకపోతే హైకోర్టుకు న్యాయ పోరాటానికి వెళ్లాలని అన్నారు. పేదలు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందా? అని ప్రశ్నించారు. పేదలంతా భూములు వదులుకొని పేదరికంలోకి మగ్గాల్సిన పరిస్థితి పాలకులు తీసుకొస్తున్నారని అన్నారు. గిరిజన ప్రాంతమైన ఈ మండలాన్ని షెడ్యూల్‌ ఏరియాలో చేర్చకుండా గిరిజను లకు భూమి లేకుండా చేశారని తెలిపారు. ఐటిడిఎ పరిధిలో చేర్చాలని చాలా కాలంగా గిరిజనులు పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గిరిజన మంత్రులు కూడా అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వటం లేదని, పట్టాలున్నా భూమి చూపడం లేదన్నారు. కబ్జాకు గురైన భూములను తిరిగి పేదలకు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. నిజంగా పేదల పక్షాన వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం ఉంటే తక్షణమే ఆక్రమిత భూములపై రిటైర్డ్‌ జడ్జితో కమిటీ వేసి, భూములు సర్వే చేసి పేదలకు భూమి దక్కేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఉపాధి హామీ పథకాన్ని కూడా ఎత్తివేసే కుట్రకు మోడీ, జగన్‌ చూస్తున్నారని, నిధులు కేటాయింపులు తగ్గించేశారని అన్నారు. ఈనేపథ్యంలో భూమి దక్కాలి, బతుకు నిలబడాలి అంటే భూమి సాధించే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఇందుకు ఎర్రజెండా అండగా ఉంటుందని తెలిపారు. సిపిఎం మండల నాయకులు తామరాపల్లి సోములు అధ్యక్షతన జరిగిన అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముందుగా లెనిన్‌ శతజయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి లోకనాధం పూలమాల వేసి నివాళులర్పించారు. .

➡️